Kodangal | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ఆ అర్ధరాత్రి నుంచే ఇలా పోలీస్ యాక్షన్ షురూ అయింది. అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్ జై లుకు తరలించారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు
ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు https://t.co/DIsZJRkZmP pic.twitter.com/VUSWFmgqYC
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024
సాధారణంగా మత కలహాలు, ఇతర పెద్ద నేరాలు జరిగిన సమయంలో సంబంధిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేస్తుంటారు. కానీ లగచర్లలో రైతుల నిరసన సమయంలో జరిగిన దాడి ఘటనపై పరిసర మండలాల్లో సైతం ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. దుద్యాల, కొడంగల్, బొంరాస్‌పేట్ మండలాల్లో అధికారులు పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయతలపెట్టిన లగచెర్లతోపాటు హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో మంగళవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. పలు ఇండ్లకు తాళాలు వేసి కనిపించాయి.
దుద్యాల మండలం లగచర్ల బాధితులకు సంఘీభావం ప్రకటించడానికి వస్తున్న బీఆర్ఎస్ బృందా న్ని పోలీసులు అడ్డుకున్నారు. లగచర్ల వైపు ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు పెట్టి వాహన తనిఖీలు చేపట్టారు. పరిగి, మన్నెగూడతోపాటు ఇతర చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరిన శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వికారాబాద్, కొడంగల్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పు ల మహేశ్‌రెడ్డి, బీసీ కమీషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, రాష్ట్ర నేత కార్తీక్‌రెడ్డిని పోలీసులు మన్నెగూడలోనే అడ్డగించి అరెస్టు చేశారు.
దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. లగచర్లలో అధికారుల ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశ స్థలానికి రైతులెవరూ రాకపోవడంతో కలెక్టర్ అధికారులతో కలిసి లగచర్లకే వెళ్లారని, వెళ్లాక గ్రామస్థులు అధికారులపై ముప్పేట దాడి చేశారని తెలిపారు.