హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడానికి వస్తే తాను గైర్హాజరు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కోదండరాంతోపాటు మరో సభ్యుడు తనకు సమాచారం ఇవ్వకుండా తమ కార్యాలయానికి వచ్చారని పేర్కొన్నారు. తాను కొన్ని రోజులుగా దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నానని, ఈ కారణంగానే ఈ నెల 26న రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంతోపాటు 27 నుంచి ముంబైలో జరుగుతున్న ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వెళ్లలేదని తెలిపారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ నెల 26న తనను కలిసి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి ఈ నెల 31న మధ్యాహ్నం 3.30 గంటలకు సమయం కేటాయించాలని కోరారని చెప్పారు. దానికి తాను అంగీకరించడంతోపాటు అదే రోజు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు వివరించారు. అయితే, కోదండరాంతో పాటు నూతనంగా ఎన్నికైన ఇతర ఎమ్మెల్సీలు సోమవారం తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా వచ్చారని వెల్లడించారు. శాసన మండలి చైర్మన్‌గా నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.