CI Rajitha Reddy | కోదాడ, సెప్టెంబర్ 25: రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చయ్యే తిరుగుతరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన 42 మంది రైతులు తమకు అన్ని అర్హతలున్నప్పటికీ రుణమాఫీ కాలేదని బుధవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారులు ఆన్లైన్లో తప్పులు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
రుణమాఫీ కాలేదంటే అధికారులకు చెప్పాలే గానీ ఆఫీసుకు తాళం వేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. ‘రూ.లక్ష రుణమాఫీ కోసం ఆందోళన చేస్తారా? ఇది ఏం నిరసన? అందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి. లక్ష రూపాయలు ఖర్చయ్యే తిరుగతరు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. తమకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో నిరసన తెలిపేందుకు వస్తే.. పోలీసులు కేసుల పేరుతో భయపెట్టడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు.