సూర్యాపేట, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : గతంలో బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించానని, అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపునకు కృషి చేస్తానని కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి సమావేశమయ్యారు.
చిన్నపాటి వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కన పెట్టి కోదాడలో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించడంతో అసమ్మతి నాయకులు అంగీకరించారు. అనంతరం కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణతో కలిసి శశిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలపాటు జరగని అభివృద్ధి బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదిన్నరేండ్లలోనే జరిగిందని తెలిపారు. అలాంటి పార్టీ విచ్ఛిన్నానికి తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని వారు ప్రకటించారు.