హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా గత నాలుగు రోజులుగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘కేకేఆర్’ కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. క్రీడాకారులను అభినందించారు. ఫైనల్లో విజేతగా నిలిచిన ‘రేయంచి’ టీమ్‌కు ట్రోఫీ, రూ.లక్ష నగదు పారితోషకాన్ని అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన ‘రాయోలిన’ టీమ్‌కు రూ.50వేల నగదు పురస్కారాన్ని అందించారు. అనంతరం క్రీడాకారులు, టీఆర్ఎస్వీ నేతలతో కలిసి కవిత పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కవిత జన్మదినం సందర్భంగా టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమేనని, అందరు క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర సాధన ఉధ్యమంలో తండ్రికి తోడుగా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలనే సంకల్పంతో అమెరికాలో లగ్జరి జీవితాన్ని వదులుకొని కేటీఆర్, కవిత ఇద్దరు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మ పండుగకు మళ్లీ పునరుజ్జీవం పోసి, ప్రపంచానికే చాటి చెప్పారన్నారు. కవిత ఆదర్శవంతమైన మంచి నాయకురాలని, బెస్ట్ పార్లమెంటేరియన్‌గా పేరు తెచ్చుకున్నారన్నారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వహుకులు టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీకుమార్, అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పలువురు టీఆర్ఎస్వీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.