హైదరాబాద్ : కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. వరంగల్‌లోని కాకతీయ టెక్స్టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్‌పూర్‌లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కైటెక్స్ గ్రూప్ మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్ గ్రూప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టాలని కైటెక్స్ గ్రూప్ నిర్ణయించిందని తెలిపారు. దీంతో 22 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 18 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. కైటెక్స్ పరిశ్రమలో 85 నుంచి 90 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్ కొనుగోలు చేయనుందని తెలిపారు. సీఎస్ఆర్ కింద రూ. 6 కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వనుంది అని పేర్కొన్నారు. వచ్చే నవంబర్ నుంచి కైటెక్స్ గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఇతర రాష్ట్రాలు కైటెక్స్‌ను ఆహ్వానించినా.. రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసి తాము ఆహ్వానించామన్నారు. ఆ తర్వాత పెట్టుబడి అవకాశాలను వివరించామని కేటీఆర్ తెలిపారు.
మంత్రి కేటీఆర్ చూపిన చొరవ వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల వాతావరణం, విధానాలు నచ్చాయని పేర్కొన్నారు. 3 మిలియన్ దుస్తులను ఉత్తప్తి చేసి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తామని సాబూ ఎం జాకబ్ తెలిపారు.
The Govt. of Telangana and Kitex Group entered into an MoU in the presence of Ministers @KTRTRS, @DayakarRao2019 and @SabithaindraTRS in Hyderabad today. Prl. Secretary @jayesh_ranjan and Kitex Group MD Sabu Jacob signed the MoU respectively. pic.twitter.com/oOqF8rSdwA
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 18, 2021