హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిన్నపిల్లల బట్టల తయారీ సంస్థ ‘కిటెక్స్’ కేటీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ర్టానికి వచ్చిందని సీనియర్ పాత్రికేయుడు సురేశ్ కొచ్చటిల్ తెలిపారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, కేరళలో కార్యకలాపాలు సాగిస్తున్న కిటెక్స్ సంస్థ అక్కడి ప్రభుత్వ విధానాలతో విసుగుచెంది తమిళనాడుకు వెళ్లేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కార్యాలయానికి సమాచారం అందించానని చెప్పారు. కిటెక్స్ వ్యవస్థాపకుడు, ఎండీ సాబూ జాకబ్ సమాచారాన్ని వారికి చేరవేశానని పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ వెంటనే స్పందించి ఒకటి రెండు రోజుల్లోనే ప్రైవేట్ విమానాన్ని కేరళకు పంపి జాకబ్‌తోపాటు కిటెక్స్ బృందాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని తెలిపారు. హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్లో వారిని వరంగల్‌కు తీసుకెళ్లి అక్కడ వస్త్ర పరిశ్రమకు కేటాయించిన భూములను చూపించినట్టు వివరించారు. అనువైన భూమిని ఎంపిక చేసుకున్న సాబూ జాకబ్ వెంటనే రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు అని సురేశ్ గుర్తుచేశారు.
50 వేల మందికి ఉపాధి
కిటెక్స్ సంస్థ సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడితో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌తోపాటు హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్‌లో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రం నుంచి రోజుకు 22 లక్షల బట్టలను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. కిటెక్స్ కంపెనీలో సుమారు 50,000 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనుండగా, అందులో 80 శాతం మహిళలకే అవకాశం కల్పించనున్నట్టు సాబూ ఇదివరకే వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కిటెక్స్ సంస్థకు వరంగల్‌లో 185 ఎకరాలు, సీతారాంపూర్‌లో 250 ఎకరాల భూమిని కేటాయించింది. వరంగల్‌లోని యూనిట్ త్వరలోనే ఉత్పత్తిని ప్రారంభించనుండగా, కిటెక్స్ ద్వారా ఏటా రూ.4,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుందని అంచనా. కిటెక్స్ బట్టల తయారీకి చాలావరకు మన రాష్ట్రంలోని రైతుల నుంచే కాటన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించడం విశేషం.