హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ (కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్)ను మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కైట్ ఫెస్టివల్ దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఇసుక తప్ప ఏమీలేని సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలు పర్యాటక రంగంలో ఎంతో ప్రగతి సాధించాయని, అన్ని వనరులూ ఉన్న మన దేశంలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, అందులో భాగంగానే అత్యంత సీనియర్ అయిన జూపల్లికి పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ ఫెస్టివల్ ప్రారంభానికి ముందు పర్యాటక శాఖ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం 16 దేశాలకు చెందిన కైట్ ఫ్లైయర్స్ వివిధ రకాల పతంగులను ఎగురవేశారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా పెద్ద సంఖ్యలో మిఠాయిలు, చేనేత వస్తువుల స్టాల్స్‌ను ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.