హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారో, అదే నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని కసితో గద్దె దింపుతారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమ నేపథ్యంలో తమను హౌస్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని ధ్వజమెత్తారు.
అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్, జూలై 4 (నమస్తేతెలంగాణ): నిరుద్యోగ యువత శుక్రవారం చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. అరెస్టులతో నిర్బంధాలతో కట్టడి చేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు. జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని, పోస్టులను భర్తీ చేయాలని చేపట్టిన సచివాలయ ముట్టడికి వెళ్తున్న డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసినా ముట్టడిని విజయవంతం చేసినట్టు తెలిపారు.