కొండమల్లేపల్లి, జూన్ 11: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్‌లో కాంగ్రెస్ నాయకుల గ్రూపు తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆదివారం సాయం త్రం పీపుల్స్ మార్చ్ జరుగుతున్న సమయం లో ప్రచార రథంపై దేవరకొండ మాజీ ఎమ్మె ల్యే బాలూనాయక్ మాట్లాడుతుండగా కిషన్‌నాయక్ జిందాబాద్ అంటూ పలువురు కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో బాలూనాయక్ వారితో వారిస్తుండగా.. కాంగ్రెస్ నేత కిషన్‌నాయక్ జోక్యం చేసుకొని బాలూనాయక్‌తో గొడవకు దిగి ఒకరినొకరు తిట్టుకున్నారు. బాలూనాయక్ చేతిలో ఉన్న మైకును లాక్కొని పక్కకు తోశాడు. ఇదంతా సీఎల్పీ నేత భట్టి కండ్ల ముందే జరుగుతున్నా చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు. అనంతరం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఆ తర్వాత అక్కడికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడున్న ప్రజలంతా కాంగ్రెస్ నాయకులు కుమ్ములాటలకే పనికొస్తారని, వీళ్లు రాష్ర్టాన్ని ఏం పాలిస్తారని చర్చించుకోవడం కనిపించింది. దేవరకొండ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ నేతలు నేనావత్ కిషన్‌నాయక్, నేనావత్ జగన్నాయక్, కేతావత్ బీల్యానాయక్, నేనావత్ బాలూనాయక్ వర్గాల నడుమ తగాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.