BJP | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీలో కొత్త కలకలాన్ని రేపింది. తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ వచ్చిన బీజేపీ ఒక్క సభతో ఆ అర్హత కోల్పోయింది. కాంగ్రెస్ తరహాలో బీజేపీ నేతలు బహిరంగంగా నోరు జారడమే ఇందుకు కారణం. ఈ మంటకు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాక మరింత ఆజ్యం పోసింది. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనను కిషన్ ప్రమాణ స్వీకారానికి ఎలా తీసుకొస్తారంటూ పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం నడుస్తున్నది. దాన్ని కవర్ చేసేందుకు బండి కొన్నాళ్లు ప్రయత్నించినప్పటికీ చాప కింద నీరులా ఆయన పదవికే ఎసరు పెట్టింది. దీంతో బండికి మైండ్ బ్లాంక్ అయినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇన్నాళ్లూ తాను కౌంటర్ ఇవ్వకుండా పెద్ద తప్పు చేశానని బండి భావించాడని, అందుకే కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ‘ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం ఆపేయండి’ అంటూ ఈటల వర్గానికి కౌంటర్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ‘కిషన్‌రెడ్డినైనా ప్రశాతంగా పనిచేసుకోనీయండి’ అంటూ బండి వ్యాఖ్యానించడం ద్వారా ఇన్నాళ్లూ తనను ఈటల ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పారని, దీంతో ఈటలపై కార్యకర్తల్లో ఉన్న కోపం మరింత పెరిగిందని అంటున్నారు. పరాయి పార్టీ నుంచి వచ్చి రాష్ట్ర బీజేపీని ఆక్రమించుకున్నాడంటూ కొందరు ఈటలపై మండిపడుతున్నారు. ఇక కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారంలో పలువురు బీజేపీ నేతలు ఆయనను వదిలేసి బండి సంజయ్ భజన చేశారు. దీంతో బీజేపీలో క్రమశిక్షణ ఖతమైనట్టేనని, మున్ముందు ఆ పార్టీలో కాంగ్రెస్ తరహా రాజకీయాలు చూస్తామని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కిరణ్ ఎందుకు వచ్చాడు?
‘తెలంగాణకు రూపాయి ఇవ్వను. ఏం చే సుకుంటారో చేసుకోండి’ అంటూ అసెంబ్లీ సాక్షిగా వివక్ష చూపిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావడాన్ని, స్పీచ్ ఇవ్వడాన్ని బీజేపీలో అనేక మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణకు ఆంధ్రా నేతల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. విజయశాంతి ఏకంగా ‘తెలంగాణ వ్యతిరేకులు ఉన్న చోట ఉండలేక వెళ్లిపోయాను’ అంటూ బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చాలా మంది నేతలు కిరణ్ రాకను వ్యతిరేకిస్తున్నారు. కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, లక్ష్మణ్, బండి తదితర నేతలతో శనివారం బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ పలువురు నేతలు కిరణ్‌ను ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తూ.. ‘ఆంధ్రా నేతల పెత్తనం వద్దు’ అని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.