ఖమ్మం, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తిరుమలాయపాలెం: వరదల్లో చిక్కుకొని నిరాశ్రయులుగా మారిన తమను పట్టించుకున్న వారే లేరంటూ కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని వరద బాధితులు నిలదీశారు. ఆదివారం ఖమ్మం నగరంలో పర్యటించిన కేంద్రమంత్రి ఎదుట ధంసలాపురం ప్రాంతానికి చెందిన వరద బాధిత మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ధంసలాపురం ప్రాంతంలో వరద ఇండ్లల్లోకి చేరడంతో తాము దిక్కులేని వారమయ్యామని, సర్వం కోల్పోయామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయాలని నిలదీశారు. మహిళలు ఒక్కసారిగా కిషన్‌రెడ్డిని అడ్డుకొని తమ గోడు వినాలంటూ ప్రాథేయపడ్డారు.
తాగునీటికి సైతం ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షం సృష్టించిన బీభత్సం వల్ల ఖమ్మానికి జరిగిన నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూశానని కేంద్రం తగిన రీతిలో ఆదుకుంటుందని భరోసానిచ్చారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వరద బారిన పడిన బాధితులకు అన్నిరకాలుగా సహాయం చేస్తామని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు.
‘ఆకేరు ఉప్పొంగడంతో ఇండ్లు మునిగి, పంటలు కొట్టుకుపోయి సర్వం కోల్పోయాం.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ’ అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని వరద బాధితులు వేడుకున్నారు. వరద విషాదాన్ని వివరిస్తూ దండం పెట్టి బోరున విలపించారు.