హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. తొలిసారిగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన రెండేండ్ల తర్వాత పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో కేంద్ర మంత్రి కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసుకు వెళ్లనున్నారని శుక్రవారం ఆయన కార్యాలయ అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం కొత్తగూడెం చేరుకుంటారు. 6 గంటలకు సింగరేణికి చెందిన వివిధ విభాగాల అధికారులతో సమీక్షిస్తారు. అదేరోజు రాత్రి 8 గంటలకు స్టేక్ హోల్టర్లతో సమావేశమవుతారు. ఆదివారం ఉదయం 7:30 గంటలకు సింగరేణి కార్మికులతో కలిసి కొత్తగూడెం పద్మావతి ఖని మైన్‌ను సందర్శిస్తారు. 9 గంటలకు కార్మికులతో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం అక్కడి సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న బోర్టు మీటింగ్‌లో పాల్గొంటారు. ఒక కేంద్ర మంత్రి సింగరేణి కార్పొరేట్ ఆఫీసులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని సింగరేణి వర్గాలు చెప్తున్నాయి.
ఆరోపణల నేపథ్యంలోనే..
నైని బొగ్గు బ్లాక్ టెండర్లతోపాటు ఇతర టెండర్లలోనూ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్తగూడెం పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో భారీగా అక్రమాలకు తెరలేపిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ కుంభకోణాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో బయటపెట్టారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో అవినీతి జరిగిందని రూఢీ చేసుకొన్న మీదటే కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఆయన కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తున్నది.
కేంద్ర బొగ్గుగనుల శాఖ బృందం నివేదిక
రెండురోజులుగా చేతన శుక్లా, మారపల్లి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని కేంద్ర బొగ్గు గనులశాఖ బృందం రాష్ట్రంలోని సింగరేణి ఏరియాల్లో పర్యటించింది. సీఎండీ, డైరెక్టర్‌తో కీలక భేటీలు నిర్వహించినట్టు తెలుస్తున్నది. నైని టెండర్లు, సంస్థ ఆర్థిక పరిస్థితి, బకాయిలు, సీఎస్సార్ నిధుల దుర్వినియోగంపై ఆరా తీసిన వివరాలను సేకరించింది. సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సింగరేణి సీఎస్సార్ నిధులు వినియోగించడంపైనా వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది. పూర్తి వివరాలతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి నివేదించినట్టు సమాచారం.