హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రియల్టర్ల లబ్ధి కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని తీసుకువచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ హిల్ట్ పేరిట సీఎం రేవంత్ భారీ భూదందాకు తెరలేపారని, బడా వ్యాపారులకు లబ్ధి చే కూర్చేందుకే జీవో 27ను తీసుకొచ్చారని అన్నారు. హిల్ట్ పాలసీపై ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, పరిశ్రమలు తీసేస్తే లక్షలాది మంది కార్మికుల ఉపాధి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
జోన్లు మార్చాలని ఏండ్లుగా రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మాత్రం అడగకుండానే కన్వర్ట్ చేసుకునే వీలు కల్పించడం ము మ్మాటికీ రైతు ద్రోహమే అని దుయ్యబట్టారు. కేవలం పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేలా హిల్ట్ పాలసీ జీవో ఉందని, దీంతో హైదరాబాద్లో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కారణంగా అనేక కంపెనీలు వెనక్కి వెళ్లాయని గుర్తుచేశారు. హెచ్సీయూ భూముల విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే తప్ప ప్రభు త్వం వెనక్కి తగ్గలేదని, హిల్ట్ పాలసీని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.