హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బనకచర్ల మీద తామేమీ తీర్పు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలను పిలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండూ మన రాష్ర్టాలేనని, రెండు రాష్ర్టాల మధ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి పరిష్కారానికి కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరించిందని చెప్పారు. ఈ అంశంలో సమాఖ్యస్ఫూర్తిలో భాగంగా ఇద్దరు సీఎంలను పిలిచినట్టు తెలిపారు. బనకచర్లపై చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టు సమాచారం ఉన్నదని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని వెల్లడించారు.
ఇద్దరు సీఎంల మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటామంటే.. వద్దని అంటే ఎలా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టినప్పుడు మహారాష్ట్ర సహకరించిందని అన్నారు. రెండు రాష్ర్టాల సీఎంల భేటీలో ఓ కమిటీ వేయాలని ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక గోదావరి నీళ్ల వినియోగంపై సీఎం రేవంత్ వద్ద ఏదైనా కార్యాచరణ ఉన్నదా? అని ప్రశ్నించారు.