ఖమ్మం, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి స్కామ్‌పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మౌనం దాల్చారు. నైని బ్లాక్ టెండర్ల ఉదంతం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో శనివారం కొత్తగూడెంలో సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. సింగరేణిలో భారీ అవినీతి జరుగుతున్నదని, బొగ్గు గని టెండర్ల వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, వివాదాస్పదంగా మారిన నైని బ్లాక్ బొగ్గు గనుల టెండర్లను రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం సింగరేణి ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించడంతో ఆయన ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఈ అంశంపై నోరుమెదపలేదు. ఈ అంశంపై అధికారులతో చర్చిస్తానని, పూర్తిస్థాయిలో స్పందిస్తానని పేర్కొన్నారు. కాగా శనివారం జరిగిన సింగరేణి సమీక్ష సమావేశంలో సింగరేణి భవిష్యత్ కార్యాచరణపైనే కిషన్‌రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. బొగ్గు ఆధారిత ఉత్పత్తులపై అనేక దేశాలకు ఆక్షేపణలు ఉన్నాయని, ఇదే కొనసాగితే బొగ్గు గనుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని, వీటిని దృష్టిలో ఉంచుకొని సింగరేణి అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు కూడా లేవని స్పష్టంచేశారు.
సింగరేణిలో పొదుపు చర్యలు చేపట్టాలని, దుబారా తగ్గించడంపై సెక్షన్ల వారీగా దృష్టి పెట్టాలని, ఇందుకు డైరెక్టర్లు, జీఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కార్మికులకు రెండు మస్టర్ల విధానాన్ని పరిశీలించాలని, ఒకే మస్టర్ విధానాన్ని అమలుచేయాలని తద్వారా ఏడాదికి రూ.250 కోట్లు ఆదా చేయొచ్చని కిషన్‌రెడ్డి సూచించారు. ఎక్కువ పని సమావేశంలో సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, తిరుమలరావు, జీఎంలు కవితానాయుడు, కిరణ్‌కుమార్, రాజీవ్‌కుమార్, మురళీధర్, లక్ష్మీపతిగౌడ్, దామోదర్‌రావు, సీఎంవో డాక్టర్ కిరణ్‌రాజ్‌కుమార్, కార్పొరేట్ స్థాయి అన్ని జీఎంలు, హెచ్వోడీలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 24 (నమస్తే తెలంగాణ): చరిత్ర కలిగిన సింగరేణిని రక్షించుకోవాలని, ఆ దశలో ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బొగ్గు గనుల సందర్శన, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం కిషన్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టెండర్ల వివాదం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఈ అంశంపై ప్రత్యేకంగా పూర్తిస్థాయిలో తరువాత మాట్లాడుతానని చెప్పారు.
ముఖ్యంగా సైట్ విజిట్ నిబంధన పెద్ద సమస్యగా మారిందని, దీనిపై కొత్త సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ సింగరేణికే ఇవ్వాలనే రూల్ లేకుండా చేస్తామని పేర్కొన్నారు. శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో టెండర్ల రద్దు వివాదాల గురించి చర్చించలేదని స్పష్టంచేశారు. ఇల్లెందులో జేకే ఓసీకి అనుమతులు వచ్చాయని, మళ్లీ పూర్వవైభవం వస్తుందని చెప్పారు. సోలార్ స్కాం విషయంలో కూడా త్వరలో మాట్లాడతానని, కోల్ బ్లాకుల్లో సింగరేణి పాల్గొంటే అన్నిబ్లాకులు మనకే వస్తాయని తెలిపారు.