హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రుల మధ్య వాటాల పంపిణీ పంచాయితీతోనే నైనీ టెండర్ల వివాదం వెలుగుచూసిందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే నైని సహా సింగరేణిలో జరిగిన అన్ని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని స్పష్టంచేశారు. నైని టెండర్ల వివాదం నేపథ్యం లో బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సింగరేణిని కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నదని, అవినీతి అక్రమాలకు సంస్థను బంగారు బాతులా వాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. సింగరేణి సంపూర్ణ ప్రక్షాళన జరగాలని, త్వరలోనే కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శితో రాష్ట్ర సీఎస్‌కు లేఖ రాయిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అవినీతికి బాటలేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. జాతీయంగా బొగ్గు టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన లేదని స్పష్టతనిచ్చారు.