హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డారని
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao ) మండిపడ్డారు. రాజ్యసభలో కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టుకున్నారని ఆరోపించారు.
ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రక అవాస్తవమే కాదు.. తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహమని అన్నారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు.
కాళేశ్వరం ( Kaleshwaram ) పై రేవంత్ చేస్తున్న దుష్ర్పచారాన్ని వల్లెవేస్తూ పార్లమెంట్లో విషం కక్కుతారా? నాడు కాళేశ్వరంపై ప్రశంసలు కురిపించి, నేడు రాజకీయ లబ్ది కోసం అబద్దాలా? తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలంగాణ గొంతు కోస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ పాపంలో కిషన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంట అన్నట్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని వెల్లడించారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్లో చేయడం కాంగ్రెస్, బిజేపీ చీకటి పొత్తుకు సాక్ష్యమని స్పష్టం చేశారు.
కిషన్‌రెడ్డికి సవాల్
ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మించడం అబద్దమా? 148 మీటర్ల దిగువ ప్రాంతం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్దమా? . మండుటెండల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల ద్వారా జలాలు రైతుల పొలాలకు చేరుతుండటం అబద్దమా? ఏది అబద్దం కిషన్ రెడ్డి? అంటు నిలదీశారు. పంట పొలాల్లో పారుతున్న కాలేశ్వరం జలాలను చూపించేందుకు నేను సిద్ధం. వచ్చేందుకు మీకు దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు.
క్యాబినెట్ మంత్రిగా ఉండి, ఏ ప్రభుత్వం అయినా ప్రజా ధనంతోనే నిర్మాణాలు చేస్తుందన్న ఇంగితం మరిచి కేసీఆర్ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం మీ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనమని వ్యాఖ్యనించారు. గతంలో బీజేపీ ప్రభుత్వ పెద్దలే నితిన్ గడ్కరీ నుంచి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్దం అంటారా? అవివేకం అంటారా ? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా’ (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. 2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలే ’ అని వెల్లడించడం మీ కళ్ళకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, తెలంగాణకు నిధులు కేటాయించాలని ఎంపీ సురేశ్ రెడ్డి ఎంతో హుందాగా బాధ్యతగా మాట్లాడిన దాన్ని సమర్థించకపోగా ఉల్టా బాధ్యత మరిచి వ్యర్థ రాజకీయ ప్రేలాపనలకు పాల్పడ్డాడని హరీష్‌రావు విమరించారు.8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని రిప్రెజెంట్ చేయకుండా సప్రెస్ చేస్తుండటం సిగ్గుచేటని పేర్కొన్నారు.