కిషన్‌రెడ్డి.. బీజేపీలో అనేక పదవులు అధిష్ఠించినా.. పార్టీలో చిన్న సైజు కార్యకర్తలానే ఎలాంటి అధికారం లేని వ్యక్తిగా తయారయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హడ్డీమార్ గుడ్డిదెబ్బలా ఎంపీగా గెలిచారు.. తెలంగాణ కోటా కింద కేంద్రంలో ఓ మంత్రి పదవి వచ్చింది. కేంద్రంలో క్యాబినెట్ హోదా వచ్చిందంటే తన రాష్ర్టానికో.. కనీసం నియోజకవర్గానికో నిధులు తెచ్చి అభివృద్ధి చేసుకోవడం సర్వసామాన్యం. మన కిషన్‌రెడ్డి మాత్రం రాష్ర్టానికి తెల్ల ఏనుగే. రాష్ర్టానికి పైసా తెచ్చింది లేదు.. తాను ఉండే హైదరాబాద్ నగరానికి ఒరగబెట్టిందీ లేదు. ఆఖరుకు తాను గెలిచిన నియోజకవర్గానికైనా రూపాయి తెచ్చారా అంటే గుండుసున్నా. ఆయన మాట పార్టీలోనే ఎవరూ వినరని, అధిష్ఠానం దగ్గరైతే చెల్లని పైసే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. 24 గంటలూ హైదరాబాద్‌లో కూర్చొని.. కేసీఆర్‌పై చిత్తం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎందుకూ చేతగాని.. ఏ మాత్రం చేవలేని దండగమారి కేంద్రమంత్రి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 14 : ఖానేకో ఆగే… కామ్కో పీఛే (తినడానికి ముందు… పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన హైదరాబాద్ నగరానికి కానీ.. కనీసం తనకు ఓట్లేసి ఢిల్లీకి పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు కానీ ఈయన వల్ల కించిత్ ప్రయోజనం లేకుండా పోయింది. ఢిల్లీలో పదవులు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు తండ్లాడి ఆ రాష్ర్టానికి ఎన్నో కొన్ని నిధులు తెచ్చుకొని ప్రయోజనాలు కల్పించుకొంటున్నరు. పొరుగున ఉన్న కర్ణాటక బీజేపీ నేతలు తమ రాష్ట్రంలో ఓ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకొన్నరు. కానీ, కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర క్యాబినెట్ మంత్రి. తన శాఖకు సంబంధించి (పర్యాటకం) సొంతంగా నిర్ణయాలు తీసుకొనే పూర్తిస్వేచ్ఛ ఉంది. ఇతర మంత్రులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకొనే అవకాశమూ ఉంది. కానీ.. ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క పని చెప్పుకోదగ్గది ఉన్నదా అంటే లేదనే చెప్పాలి. రాష్ర్టానికి కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉండీ లేనట్టే. నాడు తెలంగాణ ఉద్యమంలో ‘రాజీనామా’ అనగానే అండర్‌గ్రౌండ్‌లోకి పోయిన కిషన్‌రెడ్డి సోయిలేనితనం ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ మూడు రకాల చిట్టాలు చూస్తేనే అర్థమవుతుంది.
హైదరాబాద్‌పై ఎందుకీ కక్ష?
సాధారణ బీజేపీ కార్యకర్తగా ఉన్న కిషన్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది హైదరాబాద్. 2004లో హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా, తర్వాత అంబర్‌పేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా తెలంగాణ కోటాలో కేంద్రమంత్రి అయ్యారు. అయినా.. హైదరాబాద్ కోసం చేసింది ఏమీ లేదు.
హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో అతి పెద్దది. దీనికి వయబుల్ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద కేంద్రం నుంచి రూ.254 కోట్ల మేర నిధులు రావాలి. మూడేండ్లుగా కేంద్రంనుంచి నయాపైసా రాలేదు. కిషన్‌రెడ్డి చొరవ తీసుకోలేదు.
అంబర్‌పేట నియోజకవర్గం మీదుగా వెళ్లే మూసీ నది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నది. మూసీ ఫ్రంట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నానా తిప్పలు పడి నిధులు సమీకరిస్తున్నది కానీ కిషన్‌రెడ్డికి మాత్రం పట్టదు.
మీడియా ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే కిషన్‌రెడ్డి.. 2020లో అకాల వర్షాల వల్ల హైదరాబాద్ అల్లకల్లోలమైతే కేంద్రం నుంచి పైసా సాయం తేలేదు. కేంద్ర బృందం వస్తుందని చాటుకొన్న కిషన్‌రెడ్డి తీరా మొండిచెయ్యి చూపారు.
పత్తాలేని కాపలాదారు…
నమ్మి నానబెడితే.. పుచ్చి బుర్రలైనట్టు.. సికింద్రాబాద్ పార్లమెంటుకు కాపలాదారుగా ఉంటానన్న కిషన్‌రెడ్డి పత్తా లేకుండా పోయారు. తన నియోజకవర్గ పరిధిలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత వంటి చిన్న అంశాన్ని సైతం పరిష్కరించలేని చేతకాని నేతగా మిగిలిపోయారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఈ అంశంపై కేంద్రానికి లేఖలు రాయడం.. సాక్షాత్తూ ఒక వేదికపై నేరుగా విజ్ఞప్తిచేసినా.. పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేగానీ.. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి గీ పని చేశారు.. గిన్ని నిధులు ప్రత్యేకంగా తెచ్చారు’ అన్న మాటలే లేవు. సికింద్రాబాద్ ప్రజల మీద ఆయనకెంత ప్రేమ ఉందో, ఓట్లేసిన జనం పట్ల ఆయనకెంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.