స్పెషల్ టాస్క్ బ్యూరో/ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రైతును రాజును చేసేందుకు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చుచేస్తుండగా, రైతును కూలీని చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. విప్లవాత్మక రైతుబంధు పథకం ద్వారా ఏటా రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారులైన రైతుల సంఖ్యను పెంచుకొంటూ పోతుండగా, కేంద్రప్రభుత్వం రైతులకిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల సంఖ్యను ఏటా కుదించుకొంటూ పోతున్నది. పూర్తిగా ఉచితంగా ఇచ్చే రైతుబంధును రాష్ట్రప్రభుత్వం పెంచుతుండగా, వడ్డీ తీసుకొని అప్పులిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్రం తగ్గిస్తుండటం గమనార్హం. ఈ యాసంగిలో 70.54 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా రైతుబంధు సాయం అందిస్తుండగా, కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను 47.71 లక్షలకు తగ్గించింది.
0.5 శాతం మందికే కేసీసీలు
రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా 4 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు కేసీసీలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2019-20లో 1,08,91,546 మందికి కేసీసీలు ఇవ్వగా, 2021-22లో 74,78,127కు తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి మరింత కోత విధించి 47.71 లక్షలకు కుదించింది. దేశంలో 14 కోట్ల మంది రైతులు ఉండగా, కేంద్రం 0.5 శాతం మందికే కేసీసీలు ఇస్తుండటం గమనార్హం.
70.54 లక్షల మందికి రైతుబంధు
రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.10 వేలను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. గత యాసంగి సీజన్ కంటే ఈసారి ఎక్కువ మంది రైతులు రైతుబంధును అందుకోబోతున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి కొత్తగా భూములు కొన్న రైతులకు కూడా రైతుబంధు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా భూములు కొన్న రైతులు తమ పట్టాదారు పాస్ బుక్కులతో జనవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకొంటే రైతుబంధు సాయాన్ని పొందవచ్చు. మొత్తంగా 70.54 లక్షల మంది రైతులకు రూ.7,676 కోట్లను అందించనున్నది. గత వానకాలం సీజన్లో రైతుబంధు కింద 65 లక్షల మంది రైతులకు రూ.7,434 కోట్లను ప్రభుత్వం అందించింది.