బేగంపేట్ జూలై 18: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ బంగారం చోరీ జరిగింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సమీపంలోని శ్రీని జువెలరీస్ నుంచి రాత్రి 7 గంటలకు దినేశ్ జైన్ అనే వ్యక్తి పాట్ మార్కెట్లోని ఎస్ఎస్ జువెలరీస్ దుకాణంలో అప్పగించేందుకని బంగారు ఆభరణాలను తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. బాటా చౌరస్తా సమీపంలో స్టేట్‌బ్యాంక్ మీదుగా వెళ్తుండగా ముఖాలకు మాస్కులు, హెల్మెట్ ధరించి ఉన్న ఇద్దరు దుండగులు దినేశ్ జైన్ వాహనాన్ని అడ్డగించి బంగారు ఆభరణాల బ్యాగును లాక్కొని పారిపోయారు.
వెంటనే దినేష్ జైన్ దుకాణ యాజమానికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బ్యాగులో సుమారు కిలో వరకు బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితుడు దినేష్జైన్నూ పోలీసులు విచారిస్తుండటం గమనార్హం.