MBBS | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో బయటపడ్డ కిడ్నీ మార్పిడి మాఫియాపై రాచకొండ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల 10కి పైగా కిడ్నీల మార్పిడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తున్నది. కొందరు వైద్యులు, దళారులు కలిసి అంతర్రాష్ట్ర స్థాయిలో కిడ్నీల దందా చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. గతంలో ఇలాంటి దందాలు శ్రీలంకతో పాటు ఇతర దేశాలలో జరిగేవి. కానీ ఇప్పుడు కిడ్నీ మాఫియా హైదరాబాద్‌నే సేఫ్ జోన్‌గా చేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది. సిటీలో నిఘా వ్యవస్థ పనితీరులో లోపాలు ఉన్నాయని, అసాంఘిక శక్తులకు నగరం అడ్డాగా మారడమే ఇందుకు నిదర్శనమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో అలకనంద పేరుతో ఏర్పాటైన దవాఖానకు 6 నెలల క్రితం రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు 9 పడకల దవాఖాన నిర్వహణకు అనుమతినిచ్చారు. అక్కడ సాధారణ వైద్యంతో పాటు ప్లాస్టిక్ సర్జరీకి అనుమతి ఉంది. కానీ ఆ దవాఖానలో కిడ్నీలు మారుస్తున్నారనే సమాచారంతో మంగళవారం రంగారెడ్డి డీఎంహెచ్‌వో, ఎల్బీనగర్ జోన్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు డోనర్లు, ఇద్దరు రిసీవర్లను గుర్తించి, గాంధీ దవాఖానకు తరలించారు. దవాఖాన నిర్వాహకుడు డాక్టర్ సుమంత్ విద్యార్హతలపైనా ఆరా తీశారు. సుమంత్ 2021లో రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడని, కరోనా సమయంలో పాసయ్యాడని గుర్తించారు. అతడికి తమిళనాడు, కర్ణాటకలోని కిడ్నీ మాఫియాలతో సంబంధాలున్నాయని, పథకం ప్రకారం అలకనంద పేరుతో దవాఖాన ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ర్టాల్లోని పేదలను లక్ష్యంగా చేసుకుని దళారుల ద్వారా కిడ్నీ డోనర్లను ఎంపిక చేస్తున్నాడని తెలిపారు. దళారుల ముఠా కొన్ని కార్పొరేట్ దవాఖానల వైద్యులతో సంబంధాలు కొనసాగిస్తున్నది. కిడ్నీ అవసరమైన వారిని గుర్తించి, డోనర్లను వెతికి డబ్బు ఆశ చూపుతున్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి కిడ్నీ డోనర్లను, రీసివర్లను ఎంపిక చేసుకుని, వారిని హైదరాబాద్‌కు విమానంలో తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి దవాఖానకు తీసుకొస్తున్నారని చెప్పారు.
కిడ్నీ మార్పిడి వివరాలను ఎక్కడా రాతపూర్వకంగా నమోదు చేయకుండా దవాఖాన నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పోలీసులు దవాఖానతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు వివరాలు వెల్లడించేందుకు మొండికేస్తున్నారని, వారి నుంచి సరైన సమాచారం రావడంలేదని తెలిసింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. అక్కడికి వైద్యులు, రోగుల రాకపోకల గురించి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల బ్యాకప్ ఎంత ఎక్కువ బ్యాకప్ ఉంటే అంత ఎక్కువ సమాచారాన్ని రాబట్టవచ్చని చెప్తున్నారు. అలాగే సుమంత్ కాల్‌డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలను విశ్లేషిస్తున్నారు. కిడ్నీ డోనర్లు, రీసీవర్లతో కాకుండా మొత్తం దళారులతోనే వ్యవహారం నడుస్తున్నదని, ఒకో కిడ్నీకి రూ. 55 లక్షల వరకు అమ్ముతూ, డోనర్లకు రూ. 4 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా మొత్తం వైద్యులు, దళారులు పంచుకుంటున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
గతంలో వెబ్సైట్లు, సోషల్‌మీడియా ద్వారా కిడ్నీ మాఫియా కార్యకలాపాలు సాగించేంది. కిడ్నీ అవసరమైన వారి కోసం, డోనర్లను వెతికేవారు. పేదలను ఎంపిక చేసుసుని కిడ్నీల మార్పిడికి ఫ్లాన్ చేసేవారు. డోనర్లను, రీసివర్లను శ్రీలంకతోపాటు వివిధ దేశాలకు తరలించి అక్కడ కిడ్నీ మార్పిడి చేయించిన ఘటనలున్నాయి. ఇలాంటి ఘటనలపై హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నారు.