వరంగల్ చౌరస్తా : నగరంలోని ప్రధాన కూడలిలో యువకుడి కిడ్నాప్ ( Kidnapp ) వ్యవహారం కలకలం రేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ( Warangal ) వాసవి కాలనీకి చెందిన అశోక్ కుమార్ నగరంలో ఆటో స్పేర్‌పార్ట్స్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు .
జల్సాలకు అలవాటు పడిన అతని కుమారుడు అభిత కుమార్ (31) ఆర్ధిక అవసరాలకు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు తానుగా పథకాన్ని రచించాడు. మధ్నాహ్నం సమయంలో ఇంటి నుంచి బ్యాంకు పని నిమిత్తం వెళుతున్నట్లు తెలుపుతూ తన స్నేహితుల సహాయంతో అనుకున్న విధంగా పథకాన్ని అమలు చేశాడు. సాయంత్రం సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి తాను కిడ్నాప్‌నకు గురైనట్లు, కిడ్నాపర్లు కోరినట్లుగా పది లక్షలు ముట్టజెప్పి తనను విడిపించాలని కోరాడు.
దీంతో తండ్రి అశోక్ కుమార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆదారాలను సేకరించారు. ఫోన్లో ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హంటర్ రోడ్డు మీదుగా నగర శివారు ప్రాంతానికి చేరుకొని ఆటోలో వేచివున్న అభిత కుమార్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మట్టెవాడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా కిడ్నాప్‌నకు గురైన పోచమ్మమైదాన్ సెంటర్ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు సేకరించి, విచారణ చేపట్టారు.