ఖమ్మం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడోవిడత ఎన్నికల ఫలితాల్లోనూ ఖమ్మంజిల్లా ఓటర్లు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు విజయాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యవేక్షణలో గులాబీ పార్టీ గుబాళించింది. ఐదు మండలాలకు మూడు మండలాల్లో మెజార్టీ పంచాయతీలను బీఆర్ఎస్ సాధించింది. మంత్రి పొంగులేటి సొంత మండలం కల్లూరులో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. ఎన్నికలు జరిగిన 21 పంచాయతీలకు కాంగ్రెస్ కేవలం 4 గ్రామాలకే పరిమితం కాగా బీఆర్ఎస్ 12 గెలిచింది. సత్తుపల్లి మండలంలోనూ బీఆర్ఎస్ మద్దతుదారుల చేతిలో కాంగ్రెస్ ఖంగుతిన్నది. 21 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవమయ్యాయి. 18 పంచాయతీల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. వేంసూరు ఓటర్లు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. 26 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా, 23 గ్రామాల్లోని 12గ్రామాలను బీఆర్ఎస్, 10స్థానాల్లో కాంగ్రెస్ గెలిచాయి. పెనుబల్లి మండలంలో 32 పంచాయతీల్లో 2 ఏకగ్రీవం కాగా, 30లో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 9, రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. తల్లాడ మండలంలో బీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా, మిగతా 24లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 13, సీపీఎం-1, స్వతంత్ర-1 విజయం సాధించారు. తల్లాడ బీఆర్ఎస్ వశమైంది.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం జిల్లాలో పల్లె ఓటర్లు గులాబీ పార్టీకి నీరాజనాలు పలికారు. మూడు విడతల్లో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ 108 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 267 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఐ కూడా 44 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జిల్లాలో మూడో విడతలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాత్సవాలు చేసుకున్నారు. టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు మండలాల్లో సంబురాలు చేసుకున్నారు. అధికారం లేకపోయినా అన్నిచోట్ల సత్తాచాటడంతో కార్యకర్తలు ఊరేగింపులు నిర్వహించారు.
బీఆర్ఎస్ వైపే వరికోల్ ప్రజలు
పరకాల, డిసెంబర్ 17: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మద్దతు లభించింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామం హనుమకొండ జిల్లా వరికోల్‌లో రికార్డుస్థాయి మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి దొగ్గెల కుమారస్వామి ఘనవిజయం సాధించాడు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మంద శరత్‌కుమార్‌పై 1640 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా, 10 వార్డుల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
గ్రామ ప్రజలు ఎప్పుడూ అభివృద్ధివైపే నిలుస్తున్నారు.. ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి గ్రామ అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. ఈ విజయం ఎంతో చరిత్రాత్మకమైనదని, ఈ విజయాన్ని కేసీఆర్‌కు కానుకగా అందిస్తున్నామని తెలిపారు.