Bus Accident | ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు గాయపడగా, పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.వేంసూరు మండలం మద్దులగూడెంలో ఉన్న వివేకానంద విద్యాలయం నుంచి విద్యార్థులతో బయల్దేరిన ఈ స్కూల్ బస్సు.. గణేష్పాడు, ఎల్ఎస్ బంజర్, కెఎం బంజర్, మర్లకుంట, ముత్తుగూడెం గ్రామాలకు చెందిన విద్యార్థులను వారి ఇళ్లకు దింపుతూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గణేష్పాడు గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ బస్సును అతి వేగంగా నడపడంతో వాహనం నియంత్రణ కోల్పోయి కాలువలోకి పల్టీ కొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో అరుపులు, కేకలు వినిపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో VM బంజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను స్థానికుల సహకారంతో బయటకు తీసి అంబులెన్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా పెనుబల్లి, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఘటనపై విచారణ జరిపిన ఆయన, సబ్ కలెక్టర్, ఏసీపీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గణేష్పాడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొనగా, విద్యార్థుల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.