రఘునాథపాలెం, జూలై 9 : పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అలీనగర్‌కు చెందిన బోడా ప్రసాద్, లలిత దంపతులు. వీరు గ్రామ పరిధిలోని 7 ఎకరాల భూమిలో 15 ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఖమ్మం నగరానికి చెందిన లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారు పాస్ పుస్తకం తెచ్చుకొని కొద్దిరోజులుగా ప్రసాద్ భూమి వద్దకు వచ్చి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు.
పోడు రైతు ప్రసాద్, కానిస్టేబుల్ లక్ష్మణ్ రఘునాథపా లెం పోలీసులను ఆశ్రయించారు. పట్టాదారు పాస్ పుస్తకం తెచ్చుకున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ అసలు ఈ గ్రామానికి చెందిన వాడు కాదని, పట్టా ఎలా వచ్చిందో విచారణ చేసి తనకు న్యాయంచేయాలని ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన సీఐ శ్రీహరి.. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను నివేదిక కోరాడు. అటవీ శాఖ అధికారుల రికార్డు మేర కు కానిస్టేబుల్ లక్ష్మణ్‌కు పట్టా ఉన్నదని, ప్రసాద్ తాను సాగు చేసుకుంటున్న భూమిపై ఎలాంటి ఆధారాలు లేవన్నట్టుగా నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దాని ప్రకారం కానిస్టేబుల్ లక్ష్మణ్‌కు న్యాయం చేసే క్రమంలో సీఐ తనను నిత్యం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు బాధితుడు ప్రసాద్ ఆరోపించాడు. 20 రోజులుగా స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెడుతున్నారని వాపోయాడు.
తాను స్ట్టేషన్‌లో కూర్చున్న సమయంలో కానిస్టేబుల్ లక్ష్మణ్ కొందరు మనుషులను తీసుకెళ్లి తాను వేసిన పత్తి పంటను నాశనం చేసినట్టు ఆవేదన వ్యక్తంచేశాడు. స్టేషన్లో ఉన్న తాను వెంటనే ఈ విషయాన్ని సీఐకి ఫోన్ చేసి తెలుపగా.. సదరు భూమి కానిస్టేబుల్ లక్ష్మణ్‌కు చెందింది కదా? అంటూ సమాధానం ఇవ్వడంతోపాటు అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు వాపోయాడు. ప్రసాద్ ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
సీఐ వేధింపులు తాళలేకనే..
15 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమి దక్కదేమోననే ఆందోళనతోపాటు సీఐ తనపై రౌడీషీట్, పీడీ యాక్ట్ నమోదు చేస్తానని బెదిరించడంతోనే ప్రసాద్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అతడి భార్య లలిత ఆరోపించింది. ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రేరేపించిన రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎఫ్ఆర్వో రాధి క, కానిస్టేబుల్ లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె ఖమ్మం సీపీకి ఫిర్యాదు చేసింది.