హైదరాబాద్, నవంబర్23 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల సంఖ్య పెరిగినా, వసతుల కొరత సమస్య పీడిస్తున్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బడ్జెట్ మాత్రం అంతగా పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికింకా అరకొర నిధులే కేటాయిస్తున్నాయి. ఫలితంగా కేబీబీవీలు సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మా-రాయి. కొన్నింటిలో టాయిలెట్ల కొరత, మరికొన్నింటిలో వసతుల లేమి సమస్య పీడిస్తున్నది. డార్మెటరీల్లో 20 మంది ఉండాల్సిన చోట 30-35 మందిని కుక్కుతున్నారు. కొన్నింటిలో అకాడమిక్ బ్లాక్ ఉంటే డార్మెటరీ, డార్మెటరీ ఉంటే అకాడమిక్ బ్లాక్‌లు లేవు. వసతులు లేమి కారణంగా ఇంటర్ విద్యార్థులకు సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహించలేని పరిస్థితులున్నాయి. ఇటీవలే ఇంటర్‌బోర్డు కేజీబీవీలకు ప్రాక్టికల్ సెంటర్లు ఇవ్వబోమని స్పష్టంచేసింది.
కేజీబీవీలు బీద బిక్కి బాలికలకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. జాతీయంగా వివరాలను పరిశీలిస్తే.. 53% ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకుంటున్నారు. 27% ఎస్సీ బాలికలుండగా, ఎస్టీలు 26% ఉన్నారు. 35% ఓబీసీలు చదువుకుంటున్నారు. రాష్ట్రంలో మాత్రం అత్యధికంగా 52% బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు కేజీబీవీల్లో చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు మొత్తం కలిపితే 44% వరకు ఉన్నారు. అంటే 96% ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులేనన్నమాట. ఇలాంటి విద్యాసంస్థలకు గతంలోనూ అరకొర బడ్జెట్ కేటాయించిన దాఖలాలున్నాయి. 2017-18లో బడ్జెట్ రూ. 349కోట్లు మాత్రమే ఉండగా, కేసీఆర్ సర్కార్ హయాంలో వీటి బడ్జెట్‌ను వరుసగా 2018-19లో రూ.429కోట్లకు, 2019-20లో రూ.643 కోట్లకు, 2020-21లో రూ.524కోట్లకు పెంచారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత యేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. బడ్జెట్‌ను అంతగా పెంచడంలేదు. ఒక యేడు రూ.కోటికి కోత పెట్టారు. ఈ విద్యాసంవత్సరంలో రెండు కోట్లు మాత్రమే పెంచారు.
కేజీబీవీలను గతంలో 10వ తరగతి వరకే నిర్వహించేవారు. క్రమంగా వీటిని ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఒకేసారి 120కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్‌చేశారు. దీంతో వీటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరగడంతో వసతుల కొరత సమస్య వేధిస్తున్నది. వసతుల కొరతపై ఇటీవలే పాఠశాల విద్యాశాఖ సర్వే నిర్వహించింది.
టీజీఈడబ్ల్యూఐడీసీ సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. టాయిలెట్ల కొరత, గదుల కొరత ఉన్నట్టు తేలింది. డైనింగ్హాల్స్లేవని వెల్లడయ్యింది. అదనపు తరగతి గదులు, అకాడమిక్ బ్లాక్‌లు నిర్మించాలని నివేదించారు. 10వ తరగతి వరకు గల కేజీబీవీలకు ఒక్కోదానికి రూ. 50-60లక్షలు, ఇంటర్ వరకు గల కేజీబీవీలకు ఒక్కోదానికి రూ. 80లక్షల చొప్పున అదనపు నిధులు మంజూరుచేయాలని సర్కారుకు ప్రతిపాదించారు.
