నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 28: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ టీచర్లు 18 రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఫలితంగా తమకు పాఠాలు బోధించే వారే లేకుండా పోయారంటూ కేజీబీవీ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి.. తమ చదువులు ముందుకు సాగేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యార్థినులు కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాల ఎదుట శనివారం ఆందోళనలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని కేజీబీవీ ఎదుట విద్యార్థినులు బైఠాయించారు. తాత్కాలికంగా టీచర్లను నియమించి అధికారులు చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు.
సబ్జెక్టు టీచర్లు లేక, వచ్చిన టీచర్లు సెల్ఫోన్లకే పరిమితమవుతూ తరగతులు బోధించడం లేదని వారు ఎంఈవో రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని కేజీబీవీ ఎదుట విద్యార్థినులు ప్లకార్డులతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నా సిలబస్ పూర్తి కాలేదని, ఇంటర్ ప్రాక్టికల్స్ ఎలా చేయాలో అర్థం కావడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఎస్సై తిరుపాజీ, ఎంఈవో శంకర్ అక్కడికి వచ్చి విద్యార్థినులకు నచ్చజెప్పే యత్నం చేశారు. వారు వినకపోవడంతో స్కూల్ కాంప్లెక్స్ నుంచి బోధనా సిబ్బంది ఏర్పాటు చేసినట్టు చెప్పడంతో ఆందోళన విరమించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు, ఇబ్రహీంపట్నం, మల్యాల మండల కేంద్రాల్లోని కేజీబీవీల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కల్లూరులోని పాఠశాలలకు వెళ్లిన మహిళా ఉపాధ్యాయులను అడ్డుకొని ప్రధాన ద్వారాన్ని మూసివేసి నిరసన తెలిపారు. డిప్యూటేషన్‌పై వచ్చిన వారు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ఉపాధ్యాయులే కావాలని కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి, బిచ్కుందలో గల కేజీబీవీ విద్యార్థినులు పాఠశాల ఎదుట బైఠాయించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామంలోని కేజీబీవీ పరిశీలనకు వచ్చిన ఎంఈవో వెంకటాచారి ఎదుట విద్యార్థినులు నిరసన తెలిపారు.