హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనంద దవాఖానలో బయటపడ్డ కిడ్నీ దందా కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 10కి చేరింది. కిడ్నీ మాఫియాలో చక్రం తిప్పుతున్న వైద్యుడు రాజశేఖర్‌ను ఆదివారం చెన్నైలో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో అతడే కీలక సర్జన్‌గా భావిస్తున్నారు. కేసులో మరో కీలక నిందితుడు పవన్ కోసం గాలిస్తున్నారు. నిందితుల సమాచారం ప్రకారం కిడ్నీ రాకెట్ నెట్వర్క్ మొత్తాన్ని పవన్ నడిపించినట్టు తెలుస్తున్నది. ముఠాకు జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటక వైద్యులతో, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని దవాఖానలతో సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. సెల్ఫోన్లలోని డాటా రీస్టోర్కు ప్రయత్నిస్తున్నారు.
కిడ్నీల అక్రమ మార్పిడి కేసులో పోలీసుల దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. నగరంలో కిడ్నీ మాఫియాతో పాటు, ఇతర అవయవాల అక్రమ రవాణా కూడా నడుస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిడ్నీ రాకెట్ కేసు నిందితుల విచారణలో ఈ విషయాలు గుర్తించినట్టు తెలుస్తున్నది. చాలా దవాఖానల్లో మాఫియాకు ఇన్ఫార్మర్లు ఉన్నారని, జీవన్‌దాన్ డాటాతో పాటు బ్రెయిన్‌డెడ్ పేషెంట్ల సమాచారం మాఫియాకు చేరిపోతున్నట్టు సమాచారం.
ఈ నెల 21న అలకనంద దవాఖానలో కిడ్నీ అక్రమ మార్పిడిపై సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. పోలీసులే వైద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాత్రి 10.30 గంటలకు వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి ఎందుకు తర్జనభర్జన పడ్డారని పోలీసువర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.