హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గోదావరి నికర జలాల నుంచి చుక్క నీటిని ముట్టుకోమని.. తెలంగాణ, ఏపీ వాటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 141 టీఎంసీల జలాలనే కావేరికి తాత్కాలికంగా తరలిస్తామని కొత్త ప్రతిపాదన తెచ్చింది. గోదావరి-కృష్ణ- పెన్నా- కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్ నేతృత్వంలో మంగళవారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకొన్నది.
గోదావరి నుంచి 324 టీఎంసీలను కావేరికి మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించగా.. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో అసలు మిగులు జలాలే లేవని బలంగా వాదించాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ గోదావరిపై హైడ్రలాజికల్ సర్వే చేయించామని వెల్లడించింది. గతంలో ఇచ్చంపల్లి, పోలవరం నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించగా, ఇప్పుడు సమ్మక్క బరాజ్ నుంచి చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.
గోదావరి-కావేరి లింక్‌ను సమ్మక్క బరాజ్ నుంచి చేపట్టే ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువని, అక్కడి నుంచి సీతారామ, దేవాదులతోపాటు తెలంగాణ పథకాలకు 150 టీఎంసీలకు పైగా వినియోగం ఉంటుందని అభ్యంతరం తెలిపింది. ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, అంతరాష్ట్ర జల విభాగం ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్లతోపాటు ఆయా రాష్ర్టాల అధికారులు పాల్గొన్నారు.