హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. హైడ్రా అంశంపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడేందుకు రాష్ట్ర నాయకత్వం తనకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు.
దీంతో కొన్ని నెలలుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే చర్చ నడుస్తున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్‌రావుతో పొసగకపోవడం కూడా పార్టీలో రచ్చకు దారితీసింది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో పార్టీకి డ్యామేజీని తెచ్చిపెడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.