CM Revanth Reddy | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తున్నదా? మంత్రులు చెప్తు న్న దానితో అధికారులు.. అధికారులు చెప్తున్నదానితో మంత్రులు విభేదిస్తున్నా రా? ఆయా శాఖలపై పట్టుసాధించేందుకు కొందరు మంత్రులు తమకు నచ్చిన అధికారులను నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? మరోవైపు మంత్రులు చెప్పిందల్లా చేస్తే రేపటి రోజు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు భయపడుతున్నారా? అందుకే మంత్రులు చెప్పిన పనులు చేసేందుకు తటపటాయిస్తున్నారా? మంత్రుల శాఖల్లో అధికారులను సీఎంవోనే నియంత్రిస్తున్నదా? ఏం చెప్పినా సీఎంవో చెప్తేనే అని కొన్ని శాఖల అధికారులు తెగేసి చెప్తున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. పలు శాఖల్లో మంత్రులు, అధికారులకు పొసగడం లేదని, ఒకరి మాటను మరొకరు వినడం లేదని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అయితే సీఎంవో చెప్పుచేతల్లోకి వాళ్లంతా వెళ్లినందునే.. మంత్రులను ఖాతరు చేయడం లేదనే ప్రచారమూ జరుగుతున్నది.
ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ అధికారికి, సంబంధిత శాఖ మంత్రికి మధ్య అసలు పడటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ అధికారిని మార్చాలని సంబంధిత మంత్రి అనేక పర్యాయాలు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సదరు మంత్రికి మరింత ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తున్నది. త్వరలో జరగబోయే మార్పుల్లోనైనా ఆమెను మార్చాలని కొత్త సీఎస్‌ను మంత్రి కోరినట్టు తెలిసింది. గతంలో ఎన్నడూ ఫోకల్ పోస్టులో పనిచేయకపోవడంతో తనకు ఇబ్బంది కలుగుతున్నదంటూ మంత్రి, మంత్రి చెప్తున్న పనులు చేయకపోవడం వల్లే తనను మార్చాలని పట్టుపడుతున్నట్టు ఆ అధికారి తమతమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ఆమె ఆరోగ్యశాఖలో ఉంటే శాఖ మొత్తం కుప్పకూలినట్టేనని ఆ మంత్రి కూడా ఇతర అధికారుల వద్ద మాట్లాడుతున్నట్టు తెలిసింది. మంత్రి, అధికారి మధ్య పొసగకపోవడం ఇబ్బందిగా మారిందని ఆరోగ్యశాఖలోని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు.
రాష్ట్రంలో ఓ మహిళా మంత్రికి, ఆ శాఖలో కీలకంగా ఉన్న మరో మహిళా అధికారికి మధ్య ‘కోల్డ్‌వార్’ కొనసాగుతున్నట్టు చర్చనడుస్తున్నది. ఇటీవల మంత్రికి తెలియకుండానే కొన్ని టెండర్లను ఆ అధికారి రద్దు చేశారు. టెండర్ల రద్దు విషయం పత్రికల్లో వచ్చే వరకు మంత్రికి తెలియదు. దీంతో నిర్ఘాంతపోయిన మంత్రి ఇదేమిటని అధికారిని అడిగితే ‘సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు’ అని చెప్పారు. శాఖలోని మిగిలిన అధికారులకు కూడా సదరు ఉన్నతాధికారి ఫోన్లు చేసి ‘పనులు, పైరవీల విషయంలో మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదు.. ఏదైనా ఉంటే నాతోనే చెప్పాలి.. మంత్రికి ఏమీ తెల్వదు’ అని చెప్పడం మంత్రికి, అధికారికి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయనేందుకు నిదర్శంగా నిలిచాయి. ఈ శాఖలో పనులను ఒకరు మొదలు పెడుదామంటే.. మరొకరు నిలిపివేస్తున్నారని అక్కడి సిబ్బంది వాపోతున్నారు. ఫలితంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని వారంటున్నారు. ‘నన్ను బతిమిలాడి నా శాఖలో పోస్టింగ్ తీసుకొని.. ఇప్పుడు నా మాటే వినవా?’ అంటూ మంత్రి సదరు అధికారిని ఇటీవల గట్టిగానే హెచ్చరించినట్టు ఆ శాఖలో ప్రచారం జరుగుతున్నది.
పరిశ్రమల శాఖలోనూ కీలక విధుల్లో ఉన్న ఓ అధికారి తీరుపై రాష్ట్ర మంత్రి ఒకరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఈ అధికారి చెప్పింది విని రాష్ట్ర ప్రభుత్వం తప్పుటడుగులు వేసినట్టు అధికారవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వానికి కంచ గచ్చిబౌలి విషయంలో ఎదురు దెబ్బలు తగలడానికి ఈ అధికారి నిర్ణయాలే కారణమన్న వాదన పరిశ్రమల శాఖలో ఉన్నది. ఆయనను తొలగించాలని, కొత్త అధికారిని నియమించాలని ఓ సీనియర్ మంత్రి సైతం సీఎస్‌కు విజ్ఙప్తి చేసినట్టు సమాచారం. ఇక ఆర్థిక శాఖలో ఉన్న మరో కీలక అధికారి తీరుపైనా ఓ కీలకశాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మంత్రులతో పొసగని అధికారులంద రూ సీఎంవోకు తమ ఫైళ్లు పంపుతున్నారు. అయితే తమకు అనుకూలురైన అధికారులకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించినందున.. అక్కడి ప్రతి నిర్ణయాన్నీ సంబంధిత అధికారి సీఎంవోకు పంపుతున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. మీరిచ్చే ఆదేశాలను అమలు చేయలేమని తమతో తెగేసి చెప్తున్న అధికారులు.. సీఎంవో నుంచి వచ్చే నిర్ణయాలనే తమ తమ శాఖల్లో అమలు చేస్తున్నారని సీనియర్ మంత్రి ఒకరు సన్నిహితుల వద్ద వాపోయారట. ఇలాంటప్పుడు ఇక తమకు ఈ మంత్రిపదవులెందుకని ఆయన అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. సీఎంవోకు పంపిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఓ కీలకమంత్రి ఇటీవల నేరుగా సీఎం దృష్టికే తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పేమీ లేదని మంత్రి వాపోయినట్టు సమాచారం.