Telangana | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సాగునీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతుల సాధన, న్యాయపోరాటాలు, పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపులు తదితర అంశాల్లో కీలకపాత్ర పోషించే అంతర్ట్రాష్ట్ర జల విభాగానికి సైతం నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం సమస్యాత్మకంగా మారుతున్నది. నెలల తరబడి బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో పెడుతుండటంతో విభాగం ఇంజినీర్లే తమ సొంత జేబుల్లోంచి ఖర్చులు భరించాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సెక్షన్-3 ప్రకారం వాదనలు కొనసాగుతున్నాయి. దీంతో గత ఏడాదిగా ఇంటర్‌స్టేట్ విభాగం అధికారులు ప్రతినెలా ఢిల్లీకి వెళ్లిరావాల్సి వస్తున్నది. ఒక్కొక్కసారి అక్కడే మకాం వేయాల్సి వస్తున్నది.
అయితే, ఇంటర్‌స్టేట్ విభాగం ఇంజినీర్లకు రవాణా చార్జీలు సైతం ప్రభుత్వం చెల్లించని దుస్థితి నెలకొన్నది. విభాగంలోని ఇంజినీర్లకు సంబంధించి గత నాలుగు నెలలుగా దాదాపు రూ.1.5 కోట్లకుపైగా రవాణా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇంజినీర్లు ఢిల్లీ పర్యటన అంటేనే జంకుతున్నారు. జేబుల నుంచి పెట్టుకోలేమని ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. నెల జీతం మొత్తం రవాణా ఖర్చులకే సరిపోతున్నదని వాపోతున్నారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన వంట మనిషి, ట్రావెల్స్ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించని పరిస్థితి నెలకొన్నది. పెండింగ్ బిల్లుల విషయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించినా దిక్కులేకుండా పోయిందని ఇంజినీర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
లాయర్ల ఫీజులు సైతం
ఇదిలాఉంటే ఇంజినీర్లు బిల్లులే కాకుండా ట్రిబ్యునల్, ఇతర కేసులను వాదిస్తున్న లాయర్లకు సంబంధించిన బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. కృష్ణా ట్రిబ్యునల్ వాదనల కోసం, ఇతర పిటిషన్లపై వాదనలను వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను ప్రభుత్వం నియమించింది. దాదాపు లాయర్లకు సంబంధించి ఫీజులు నాలుగు నెలలుగా చెల్లించడం లేదని సమాచారం. మొత్తంగా రూ.10 కోట్లకుపైగానే న్యాయవాదుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు ఇంజినీర్లు వివరిస్తున్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో వాదనలను వినిపించేందుకు రాబోమని న్యాయవాదులు సైతం తెగేసి చెప్తున్నారని, అనేక విధాలుగా ప్రాధేయపడుతూ నెట్టుకొస్తున్నామని ఇంజినీర్లు వివరిస్తున్నారు. కీలకమైన సమయంలో సర్కార్ నిధులను విడుదల చేయకపోవడంతో ఒకవైపు ఆర్థికంగా, మరోవైపు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇంజినీర్లు వాపోతున్నారు. గ్రీన్‌చానల్‌లో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడమే తప్ప, ఆ దిశగా చర్యలు చేపట్టిందీ లేదని విమర్శిస్తున్నారు. కనీసం ఇకనైనా పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని ఇంజినీర్లు కోరుతున్నారు.