హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా హైదరాబాద్ నగరానికి బ్యాడ్ ఇమేజ్ వస్తుందని బీఆర్ఎస్ నేత, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. తాము పదేండ్లు కష్టపడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే, ఏడాదిగా రేవంత్ బ్యాడ్ ఇమేజ్ పెంచుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఎకనమిక్ ఇంజిన్‌గా హైదరాబాద్‌ను బీఆర్ఎస్ తీర్చిదిద్దిందని, దానిని కోలుకోని విధంగా రేవంత్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఆ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు పెట్టాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌కు ఫార్ములా రేస్ తీసుకురావాలన్న రెండు దశాబ్దాల కలను సాకారం చేసినందుకా? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకా? ఆగమైతది అనుకున్న హైదరాబాద్‌ను నిలబెట్టినందుకా? యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినందుకా?’ అని నిలదీశారు.
కేసు పెట్టాల్సి వస్తే.. రేవంత్‌పైనే పెట్టాలని శనివారం ఎక్స్ వేదికగా వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయ కక్షలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు కుట్రలు పన్నుతున్నట్టు అర్థమవుతున్నదని విమర్శించారు. ఏడాదికాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్న కేటీఆర్‌పై కక్ష పెంచుకున్నారని ధ్వజమెత్తారు.