భువనగిరి కలెక్టరేట్./చౌటుప్పల్/రామన్నపేట : జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ పర్యటించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11-30గంటలకు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ చేరుకుని ఉపాధిహామీ ఈపథకంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలిస్తారన్నారు.
అనంతరం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో మమేకమై అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలిస్తారని కలెక్టర్ వివరించారు. అనంతరం మధ్యాహ్నం 12-30నిమిషాలకు చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం మధ్యాహ్నం 3-00గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారని వివరించారు.
ఈ సందర్భంగా చౌట్పల్లిమండలంలో ఏర్పాట్లను పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావు, జాన్వెస్లీ పరిశీలించారు. వారు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి వస్తున్నారని తెలిపారు. వారి వెంట ఎంపీడీవో రాకేష్రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో రాష్ట్ర మంత్రులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు హాజరుకానున్నారు.