హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): బొంరాస్‌పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్‌పేట భూ వ్యవహారం తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.
రాత్రికి రాత్రి భూ యజమానులకు తెలియకుండా భూముల బదలాయింపు జరుగుతుండటం ఒకవంతైతే.. కీసర ఆర్డీవో ఇప్పటివరకు సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలోని రైతులకు నోటీసులు జారీ చేయడం రైతులను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నది. వాస్తవానికి ఇది ప్రైవేట్ భూముల వ్యవహారమైనప్పటికీ ‘ముఖ్య’నేత ప్రధాన అనుచరుడు రంగంలోకి దిగి ఇన్స్టంట్ పరిష్కారాన్ని చూపుతుండటం.. యజమానులకు తెలియకుండానే భూ భారతిలో భూముల లావాదేవీలు చకాచకా జరిగిపోతుండటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.
తెరపై వంద ఎకరాల విస్తీర్ణమే కనిపిస్తున్నా.. క్రమేణా సదరు ప్రధాన అనుచరుడు టార్గెట్ చేసిన 500 ఎకరాలకు పైగా భూముల బదలాయింపుతో గానీ ఆగనట్టుగా అర్థమవుతున్నది. వీటన్నింటికీ మించి.. ఇటీవలే రావల్కోల్ భూముల వ్యవహారంలో సర్కార్ పెద్దలు మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేసే అధికారికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చి 275 ఎకరాల సర్కార్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. తాజా బొంరాస్‌పేట విషయంలోనూ ప్రస్తుతం ఆర్డీవోగా ఉన్న నల్ల వెంకట్‌రెడ్డి తహసీల్దార్ హోదాలోనే ఉన్నప్పటికీ ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఇది తెర వెనుక సర్కార్ పెద్దల ప్రమేయాన్ని రుజువు చేయడంతోపాటు కొన్ని నెలల కిందటే ఈ భూదందాకు స్కెచ్ వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని బొంరాస్‌పేట సర్వే నంబర్ 323-409 వరకు ఉన్న 1,049 ఎకరాల భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. మూడు రోజుల క్రితం వందలాది మంది రైతులు మహా ధర్నా చేపట్టి కాంగ్రెస్ సర్కార్ పెద్దల తీరు.. తెరవెనుక జరుగుతున్న భూ దందాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ ఏకపక్షంగా భూముల లావాదేవీలను కొనసాగించేందుకే ఆ పెద్దలు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతున్నది.
రైతుల ఆందోళనతో భూ వ్యవహారం బయటికి తెలిసినప్పటికీ.. చాలారోజుల క్రితమే ‘ముఖ్య’నేత అనుచరుడితో కలిసి బలరామకృష్ణయ్య వారసులు పెద్ద స్కెచ్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఏండ్ల తరబడి ఈ భూ వివాదంపై మౌనంగా ఉంటూ ఒక్క కాగితాన్ని కూడా ముట్టుకోని అధికారులు ఇప్పుడు ఆగమేఘాల మీద నోటీసులివ్వడం, భూభారతిలో భూముల్ని బదలాయించే పనులు చకాచకా చేస్తున్నారు. కీసర ఆర్డీవో కొద్దిరోజులుగా రైతులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ జరుపుతున్నారు.
ఈ మేరకు ఇప్పటివరకు వంద ఎకరాల విస్తీర్ణంలోని రైతులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. సదరు బలరామకృష్ణయ్య వారసులు గతంలో ఆర్డీవో ఇచ్చినట్టు చెబుతున్న ఉత్తర్వుల ఆధారంగా(ఏ2/2183/1998, 2138/1999) వచ్చిన హైకోర్టు ఉత్తర్వులను ఇందులో ప్రస్తావిస్తున్నారు. వాటి ప్రకారం సదరు వారసులు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నందున ప్రస్తుతం రికార్డుల్లో యజమానులుగా ఉన్న వారికి నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరు కావాలని సూచిస్తున్నారు.
అయితే గతంలో హైకోర్టు ఉత్తర్వులు 30 ఎకరాల్లోపు విస్తీర్ణానికి మాత్రమే ఉండగా.. దానిని వందల ఎకరాలకు ఎలా అమలు చేస్తారనే దానిపై ఎవరూ సమాధానం చెప్పడం లేదు. దీంతో బాధిత రైతుల గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. ఏరోజు ఎవరి భూములు రికార్డుల్లో సదరు వారసుల పేరిట బదలాయింపు జరుగుతాయనేది రైతుల్ని కలవరపెడుతున్నది.
మాజీ ఎంపీ బలరామకృష్ణయ్యకు సంబంధించిన 21మందిపై 1,049 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో 255 ఎకరాల ఇనామ్ భూములు ఉన్నందున ఆ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నది. పట్టా భూముల్లో మరో 258 ఎకరాల వరకు 50బీ సర్టిఫికెట్ల ద్వారా విక్రయించారు. మిగిలినది దాదాపు 537 ఎకరాలు. వాటిని కాలానుగుణంగా అనేక మందికి విక్రయించారని, తద్వారా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ జరిగి స్వాధీనంలోనూ ఉన్నారనేది బాధిత రైతుల వాదన. దీనిపై ఏండ్ల తరబడి ఎలాంటి న్యాయ వివాదాలు లేవని చెప్తున్నారు. కానీ 2011లో అంటే 45 ఏండ్ల తర్వాత బలరామకృష్ణయ్య కుటుంబ సభ్యుల వారసులు రంగంలోకి వచ్చారు.
తమకు చెందాల్సిన భూముల్ని వీరంతా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా చేజిక్కించుకున్నారనేది వారసుల వాదన. అసలు పట్టాదారులు అమెరికాలో ఉంటే ఇతరులను రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తీసుకువెళ్లి ఆ భూముల లావాదేవీలు జరిపారని, ఆ తర్వాత మ్యుటేషన్ చేయించుకొని స్వాధీనం చేసుకున్నారని వారసులు అభ్యంతరం చెప్తున్నారు. 2016 నుంచి అధికారులు దృష్టిసారించి అవి నకిలీవా? అసలువా? అని తేల్చిస్తే వివాదం దాదాపుగా పరిష్కారమవుతుంది. కానీ అధికారులు అవేమీ చేయడం లేదు.
ప్రస్తుతం భూములపై ఉన్న రైతులు చెప్తున్న వాదన ప్రకారం.. వారసులు చూపుతున్న ఆర్డీవో ఉత్తర్వులు (ఏ2/2183/1998, 2138/1999) నకిలీవని అంటున్నారు. ఏ కార్యాలయంలోనూ ఈ ఫైల్ అందుబాటులో లేదని, ఆర్డీఐ కింద దరఖాస్తు చేసినా లేవని సమాధానమిస్తున్నట్టు ఆధారాలు చూపుతున్నారు. అంటే వందల ఎకరాల్లో అత్యంత కీలకమైన ఆర్డీవో ఉత్తర్వులు కార్యాలయాల్లో లేకుండా ఎక్కడికి పోయాయి? దానికి బాధ్యులు ఎవరు? కనీసం వాటికి సంబంధించిన ఒక్క కాగితం ముక్క లేకుండా మాయం కావడం వెనుక ఆంతర్యమేంది? ఇది కదా అధికారులు విచారించాల్సిన అంశాలు.
పైగా సదరు వారసులు ఈ ఉత్తర్వుల కాపీల ఆధారంగానే హైకోర్టును ఆశ్రయించడంతో సుమారు 30 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి తీర్పు వచ్చినట్టు చెబుతున్నారు. కీలకమైన ఆర్డీవో ఉత్తర్వుల కథ తేల్చకుండా అధికారులు ముందుకుపోతుండటం వెనుక ‘ముఖ్య’ నేత ప్రధాన అనుచరుడి ఒత్తిడిని రుజువు చేస్తున్నట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సదరు వారసులు ఆర్డీవో ఉత్తర్వులకు సంబంధించిన ప్రతులను మాత్రమే చూపుతున్నారు గానీ ఒరిజినల్ పత్రాలు చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లోనే ఫైళ్లు మాయమైన తరుణంలో ఒక పక్షం చూపుతున్న ఉత్తర్వులను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రైతులు నకిలీ డాక్యుమెంట్ల ద్వారా భూముల్ని సొంతం చేసుకున్నారని బలరామకృష్ణయ్య తరపు వారసులు చేస్తున్న ఆరోపిస్తున్నారు. అమెరికాలో ఉన్నవాళ్ల స్థానంలో వేరొకరిని పెట్టి లావాదేవీలు కొనసాగించారని చెప్తున్నారు. ఈ వివాదంలో మరి కొన్ని కీలకమైన అంశాలున్నాయి. ప్రస్తుతం భూముల స్వాధీనంలో ఉన్న రైతుల వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి.
వీళ్లు ఒకరిద్దరు కాదు.. వందల మంది ఉండగా, వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి నకిలీవా? కావా? అని తేల్చేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్లో రికార్డులు ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. అధికారులు విచారణ చేసి వాటిని తేల్చితే సరిపోతుంది. నిజంగా అవి నకిలీవైతే బాధ్యులపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాల్సిన అవసరమున్నది. మరోవైపు అమెరికాలో ఉన్న వాళ్ల స్థానంలో వేరే వారిని ఉంచి భూ లావాదేవీలు జరిపారని కూడా వారసులు ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే ఇదో పెద్ద కుంభకోణం అవుతుంది. దీంతో ఇలాంటి వాటిని తేల్చకుండా, వాటిని కేవలం ఆరోపణలకే పరిమితం చేస్తూ రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రస్తుతం భూ లావాదేవీలకు ద్వారాలు తెరువడమంటే అనుమానాలకు తావిస్తున్నది.
