హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలానికి (Ganesh Laddu Auction) ప్రత్యేకత ఉన్నది. లంబోధరుడితోపాటు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు. దానిని దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చిస్తుంటారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బండ్లగూడజాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. వేలం పాటలో ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో రూ.1.20 కోట్లకు లడ్డూను దక్కించుకోగా, ఆ రికార్డును బ్రేక్చేస్తూ ఈసారి దానిని మించి ధర పలకడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఇక్కడ లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది.
కీర్తి రిచ్మండ్ విల్లాలో 11 ఏండ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పదకొండో రోజున నిమజ్జనం చేస్తారు. ఆ రోజునే ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలంపాట పాడుతారు. ఇందులో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యాక్రమాల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోకపోవడం విశేషం.
మరోవైపు మై హోమ్ భుజా కమ్యూనిటీలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాటకు అనూహ్య స్పందన వచ్చింది. లక్ష రూపాయలతో ప్రారంభమైన ఈ వేలంపాట ఏకంగా రూ.29 లక్షలు పలికింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేశ్ దీనిని దక్కించుకున్నారు. గతేడాది రూ.25.50 లక్షలకు రియల్టర్ చిరంజీవి గౌడ్ దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేషుడికి ధీటుగా గత నాలుగేండ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్న లడ్డూ వేలంపాటలో ఇదే అత్యధిక ధర.