హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ఒక లెక్క.. రేపట్నుంచి ఇంకో లెక్క అంటూ.. ఐ యామ్ ఆన్ ది ఫీల్డ్ అంటూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబావుటా ఎగురవేయడంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము సైతం యుద్ధానికి సిద్ధమంటూ తేల్చిచెప్తున్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు విశేష స్పందన కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రజాకంటక, నయవంచక పాలన సాగిస్తున్నదని, ఇప్పుడు హక్కుల కోసం, హామీల అమలు కోసం పోరాటం ఉధృతం చేయాల్సిందేనని తేల్చిచెప్తున్నారు. తెలంగాణ నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా కోల్పోకుండా కేసీఆర్ పోరాటానికి శ్రీకారం చుడుతారని తెలిపారు. ప్రజలు కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను ఆద్యంతం వీక్షించారు. టీవీ న్యూస్ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్‌కు అతుక్కుపోయారు. సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ ప్రెస్‌మీట్ అని బీఆర్ఎస్ వర్గాలు ముందే చెప్పిన నేపథ్యంలో.. కేసీఆర్ ఏం చెప్తారా అనే ఉత్కంఠతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. మళ్లీ జలపోరాటానికి సిద్ధమంటూ కేసీఆర్ ఫుల్ జోష్‌తో ఇచ్చిన సందేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.
‘సోషల్’ వారియర్స్ సమరోత్సాహం
ప్రత్యర్థుల అసత్య ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టే బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్స్ కేసీఆర్ పోరు పిలుపు నేపథ్యంలో సమరోత్సాహం కనబర్చారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్‌తో కలిసి పోరుబాటకు సిద్ధం కావాలనే సందేశాన్ని ప్రజలకు విస్తృతంగా వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ నమ్మకద్రోహంతో రెండేండ్లుగా అరిగోస పడుతున్న తెలంగాణ ప్రజల కన్నీరు తుడిచేందుకు కేసీఆర్ కార్యాచరణ రూపొందించిన తీరును వివిధ వేదికలపై వివరించారు. పాలన విస్మరించి, కాలయాపన చేస్తున్న సీఎంకు నిద్రపట్టని రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. తెలంగాణ సింహం గర్జించింది.. ఇక కాచుకోండి అంటూ తేల్చిచెప్పారు. కేసీఆర్ స్పీచ్ మొత్తంలో ప్రజల కోసం ఆయన పడే తపన కనిపించిందని, ఇది కదా కేసీఆర్ అంటే, కేసీఆర్ ప్రజల సంపద అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. గంట వ్యవధిలోనే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలపై గులాబీ దళం కదన కవాతు కనిపించింది. పెద్దసారు నవ్వు.. అవతల పార్టీ వాళ్లకు గుబులు.. సింహం అడుగు బయటపెట్టింది.. అన్నిటికి సిద్ధం అని గర్జించింది అంటూ బీఆర్ఎస్ అభిమాను, తెలంగాణవాదులు పేర్కొన్నారు.