Sajjanar |హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ ముగిసిందని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌ను సిట్ బృందం ప్రశ్నించడం ముగిసింది’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్‌ను వేడుకున్నారా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! ఆయనను విచారించడం తమ వల్ల కాని పని అని పలువురు ఐపీఎస్‌లు సిట్ సూపర్ విజన్ అధికారికి మొరపెట్టుకున్నట్టు తెలిసింది.
‘సార్ ఆయన రాష్ర్టానికి పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తి. మాకెంతో భవిష్యత్తు ఉన్నది. ఆరోపణలు తప్ప.. సరైన ఆధారాల్లేని కేసులో ఆయనను ప్రశ్నించడం సాధ్యం కాని పని. మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరే నిర్ణయం తీసుకోండి’ అంటూ నాలుగు రోజులు క్రితమే ఉన్నతాధికారికి చెప్పుకొన్నట్టు తెలిసింది. అయితే, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఎలాగైనా పూర్తి చేయాలని, ఆ డైరెక్షన్లోనే ఇచ్చిన ప్రశ్నావళితో కేసీఆర్‌ను ప్రశ్నించాలని ఉన్నతాధికారి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినా ఐపీఎస్‌లు ససేమిరా అనడంతో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారులను ఒప్పించేందుకు ఆయన చాలా ఇబ్బందిపడినట్టు తెలిసింది. కాగా, నగర సీపీ సజ్జనార్‌తో కలిపి 10 మంది సభ్యులున్న సిట్ బృందంలో ఆరుగురు అధికారులు మాత్రమే కేసీఆర్‌ను విచారించారు.