హైదరాబాద్, సెప్టెంబర్ 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ) : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభంజనానికి ఎదురు నిలిచేవారే లేరని ఇప్పటికే స్పష్టమైంది. సామాన్యుల నుంచి మేధావుల వరకు రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇదేనని అనేక సర్వేలు తేల్చాయి. తాజాగా జాతీయ స్థాయిలో ఎన్నికల గెలుపోటములను, ప్రజల మూడ్‌ను నిక్కచ్చిగా అంచనావేసే విశ్లేషకులు కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీదేనని తేల్చి చెప్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల పేర్కొనగా.. తాజాగా ప్రముఖ సెఫాలజిస్టులు డా.సందీప్ శాస్త్రి, సంజయ్ కుమార్ కూడా ఇదే మాట చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని ‘ఇండియా టుడే’ శుక్రవారం ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్డీఎస్ కో-డైరెక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు తిరుగులేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే బీఆర్ఎస్కు గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌నీతి కోఆర్డినేటర్ సందీప్ శాస్త్రి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదని చెప్పారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బరిలోకి దిగుతున్నాయని తెలిపారు. కాగా, ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకు అందకుండా ప్రచారంలో దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు బీఆర్ఎస్కు జై కొడుతున్నాయి. అభివృద్ధికి చిరునామాగా మారిన గులాబీ పార్టీకే మద్దతుగా ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి.
సందీప్ శాస్త్రి: డా. సందీప్ శాస్త్రి ప్రముఖ పొలిటికల్ సైంటిస్ట్. లోక్‌నీతి నెట్‌వర్క్‌కు నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. జైన్ యూ నివర్సిటీ ప్రొ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన సీఈఆర్ఎస్ఎస్ఈకి డైరెక్టర్‌గా పని చేస్తున్నా రు. ఎలక్షన్ స్టడీస్, ఫెడరలిజం, సర్వే బేస్డ్ రిసెర్చ్‌పై పరిశోధనలు చేశారు.
సంజయ్‌కుమార్: సంజయ్‌కుమార్ ఇండియన్ పొలిటికల్ ఎనలిస్ట్, సెఫాలజిస్టు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కి డైరెక్టర్‌గా బాధ్యత లు నిర్వర్తించారు. ఎలక్టోరల్ పాలిటిక్స్, పొలిటికల్ మొబిలైజేషన్, ఇండియన్ యూత్, ఇండియన్ డెమోక్రసీ తదితర అంశాలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఎన్నికల హింస, ఢిల్లీ మురికివాడలు, దక్షిణాసియాలో డెమోక్రసీ, భారత రైతులు తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. గతంలో లోక్‌నీతి ప్రొగ్రామ్‌కు కో-డైరెక్టర్‌గా పని చేశారు.