ఖమ్మం, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌ది పేగుబంధమని, కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఢిల్లీ పెత్తందారుల మెహర్బానీతో కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాతా మధుసూదన్ స్పష్టంచేశారు. ఖమ్మం నగరంలోని ఆ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో జాతీయజెండాను ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ జెండాను ఉద్యమకారుడు తవిడిశెట్టి రామారావు ఎగురవేశారు. అంబేద్కర్, జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర రాజముద్ర మార్చినా, తెలంగాణ గీతాన్ని మార్చినా ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను తొలగించలేరని స్పష్టంచేశారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: సండ్ర వెంకటవీరయ్య
రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెలిపించడం ఆ పార్టీ కోల్పోతున్న ప్రజాదరణకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం వందలాది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.