నాగర్‌కర్నూల్, ఆగస్టు 24 : ఎన్నో ఏండ్ల కల సాకారం కావడంతో నడిగడ్డ సంబురపడింది. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామ సమీపం నుంచి దుందుభీ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నో ఏండ్లుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నడిగడ్డ గ్రామస్థులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఎందరో నాయకులకు మొరపెట్టుకున్నారు. ఏండ్ల తరబడిగా ఉన్న సమస్యను ఏ నాయకుడు కూడా తీర్చలేకపోయాడు. కానీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. బ్రిడ్జి లేకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. కేసీఆర్ సహకారంతో ఆయన నడిగడ్డ వాగుపై బ్రిడి నిర్మాణానికి రూ.3.2 కోట్లు మంజూరు చేయించి వంతెన నిర్మాణం జరిగేలా కృషి చేశారు. ఈ వంతెనతో నడిగడ్డ ప్రజల జీవితంలో ఓ కొత్త దశ ఆరంభమైందని, ఏండ్ల కష్టాలకు ముగింపు పడిందని గుర్తుచేసుకుంటూ ఆదివారం వారు కేసీఆర్, మర్రి జనార్దన్‌రెడ్డి చిత్రపటాలకు వంతెనపైనే క్షీరాభిషేకం చేస్తూ సంబురపడ్డారు.