హైదరాబాద్, జనవరి3 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.. ఆయన నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరిగింది.. అలాంటి ఆయన్ను ఉరిదీయాలి’ అంటూ అంతెత్తున ఎగిరిపడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అదే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వణికిపోయారా? కేసీఆర్ చెప్పిన విషయాలే వాస్తవాలుగా అంగీకరించారా? అంటే శనివారం అసెంబ్లీలో ప్రభుత్వ నిర్ణయాలే అందుకు సాక్షీభూతాలుగా నిలిచాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల నుంచి తగ్గించి 45 టీఎంసీలే కావాలంటూ కేంద్రానికి లేఖ రాసిన కాంగ్రెస్ సర్కార్ తీరును కేసీఆర్ ఎండగట్టడంతో ప్రజాకోర్టులో సర్కార్ దోషిగా నిలబడింది.
ఆ తప్పును సరిదిద్దేందుకు అసెంబ్లీ వేదికగా శనివారం రెండు తీర్మానాలు చేసింది. అందులో ఒకటి 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయగా, నల్లమలసాగర్‌కు అనుమతులు ఇవ్వొద్దని మరో తీర్మానం చేసింది. ఈ రెండు అంశాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని, కాంగ్రెస్ సర్కార్ చేయతలపెట్టిన ద్రోహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీయడంతోనే సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది.
కేసీఆర్ నిలదీత.. కాంగ్రెస్ గజగజ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటివాటా కుదింపుపై కేసీఆర్ నిలదీతతో సర్కారు బిత్తరపోయింది. ఇప్పటివరకు తప్పు చేయలేదంటూ బుకాయించింది. కానీ ఎట్టకేలకు చేసిన తప్పును రేవంత్ సర్కారు అంగీకరించింది. అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి చూపింది. 90 టీఎంసీలతో పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు 90 టీఎంసీల జలాలను కేటాయించింది. ఇటీవల కాంగ్రెస్ సర్కారు ఆ 90 టీంఎసీల జలాల్లో 45 టీఎంసీలకు కోత విధించింది. కేవలం 45 టీఎంసీలతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా లేఖ రాశారు.
సర్కార్ నిర్ణయంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీరని విద్రోహం తలపెట్టిందని నిప్పులు చెరిగారు. స్వయంగా బీఆర్ఎస్ శ్రేణులతో సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో భారీ సభలు పెట్టి కాంగ్రెస్ దుర్నీతిని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా సిద్ధం కావాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు, సభలకు సమాయత్తమవుతున్నారు. కేసీఆర్ నిలదీతతో అధికార కాంగ్రెస్ వణికిపోయింది. చేసిన తప్పును సమర్థించుకోలేక, కప్పిపుచ్చుకోలేక, సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు వెనక్కి తగ్గిన సర్కార్
కేసీఆర్ నిలదీతతో ఉక్కిరి బిక్కిరైన ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. పాలమూరు నీటి కోటాపై మాటమార్చింది. తప్పును అంగీకరించింది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ పెట్టింది. ఆద్యంతం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్పై, కేసీఆర్ నిందలు మోపే యత్నమే చేశారు. నీటికోటా 45 టీఎంసీలకు తగ్గించలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గంటలపాటు అదే వాదన వినిపించారు. అయితే చర్చ అనంతరం మాత్రం అది తప్పని అంగీకరిస్తూ తీర్మానం చేయడమే విశేషం.
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర కరువు, అత్యధిక వలసలకు గురైన ప్రాంతమని, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాటి ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టిందని, ప్రాజెక్టుకు సంబంధించి తాగు, సాగునీటికి కలిపి 90 టీఎంసీలతో అన్ని అనుమతులు సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకీగ్రీవంగా సర్కారు తీర్మానిచ్చింది. ఈ తీర్మానంతోనే 45 టీఎంసీల కోటా కుదింపు తప్పని సర్కారు స్పష్టంగా అంగీకరించింది. అదే నిజమైతే తీర్మానంలోనూ అది ప్రస్తావించేది. ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ సర్కారు ఈ విషయంలో వెనుకడుగు వేసింది.
నల్లమలసాగర్పైనా మరో తీర్మానం
పోలవరం బనకచర్ల/నల్లమలసాగర్ ప్రాజెక్టుపైనా సర్కారు ఎట్టకేలకు మేల్కొన్నది. ఇరు రాష్ర్టాల జలవివాదాలను పరిష్కరించే వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం బనకచర్ల/నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు, మరే ఇతర రూపంలోనూ గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులను కేంద్రం ఇవ్వొద్దని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించింది.