హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ‘సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు. అదే ప్రధాన వివక్ష’ అని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, టీజీబీకేఎస్ (బొగ్గు గని కార్మిక సంఘం) నేత మిర్యాల రాజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కక్షగట్టారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణపైనే కాదు.. సింగరేణి సంస్థపైనా ప్రేమే లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
సింగరేణి కార్మికవర్గాన్ని తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఏకైక ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కొనసాగుతున్నదని, అలాంటి సంస్థ మనుగడను ప్రభుత్వం కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ రక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే దక్కాలని కేసీఆర్ చొరవ చూపారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారని, దేశవ్యాప్తంగా 1,400 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అనంతరం బీజేపీ అధికారంలోకి వచ్చాక నాలుగు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేసిందని, ఆ బ్లాకులను కాపాడటం కోసం కేసీఆర్‌తోపాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా ప్రయత్నించిందని, లాభాల వాటాను 16 నుంచి 32 శాతానికి పెంచినట్టు గుర్తుచేశారు.
తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తె స్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు దానిని నిలుపుకోవడం లేదని కొ ప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక సింగరేణిపై మంత్రుల ఆధిపత్యం బాగా పెరిగిందని ధ్వజమెత్తారు. సింగరేణిలో లాభాల నుంచి ఈసారి 35శాతం వాటా ఇప్పిస్తామని ఏఐటీయూసీ చెప్పిందని గుర్తుచేశారు.
నాడు ముఖ్యమంత్రిగా సింగరేణి సంస్థలను కాపాడిందే కేసీఆరే అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. కార్మికులకు ఎక్స్‌గ్రేషియో ఇప్పంచింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఈ సంస్థలో 40,000 కార్మికులు ఉండటానికి కూడా ఆయనే కారణమని తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారమే కొప్పుల ఈశ్వర్‌ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు చెప్పారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.