హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల కోలాహలంతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సందడి నెలకొన్నది. వందలాది వాహనాలతో ఎర్రవెల్లి పరిసరాలు సోమవారం కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు బారులు తీరడంతో ఎర్రవెల్లి ప్రాంగణమంతా గులాబీమయమైంది. అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంతో.. ఉద్వేగంతో నినాదాలు చేశారు. ‘కేసీఆర్ జిందాబాద్, తెలంగాణ జిందాబాద్, కేసీఆర్ రావాలి, సీఎం కేసీఆర్’ అనే నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. శ్రేణులను పలకరిస్తూ కేసీఆర్ నాలుగు గంటలపైనే నిరంతరాయంగా నిలబడి వారి తో ఫొటోలు దిగారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు.
సర్వమత ఆశీర్వాదాలు..
కేసీఆర్‌కు సర్వమత పెద్దలు మహదాశీర్వచనాలు, వేదమూర్తుల మంత్రోచ్ఛరణాలతో ఆ ప్రాంగణం పవిత్రతను సంతరించుకున్నది. కుంభమేళా, తిరుపతి, యాదాద్రి, వేములవాడ సహా వివిధ పుణ్యక్షేత్రాల్లో మొక్కులు చెల్లించి, కానుకలు కట్టి, లడ్డూ ప్రసాదాలను తెచ్చి అభిమానం చాటుకున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రసాదాలను, పసుపూ కుంకుమలు తెచ్చి అభిమాన నేతకు అందించేందుకు ఎర్రవెల్లికి పోటెత్తారు. కొంతమంది అభిమానుల వివిధరకాల సృజనాత్మక భావప్రకటన రూపాలను కేసీఆర్‌కు అందజేశారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు తనకోసం ప్రత్యేకించి తయారుచేసిన కళారూపాలను కేసీఆర్ స్వీకరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు సహా పార్టీ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. సాయం త్రం వరకు అభిమానుల తాకిడి పెరిగి, దూర తీరాల నుంచి వచ్చిన వారు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇంటి పైనుంచి అందరికీ అభివాదం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా కేరింతలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘జై కేసీఆర్, హ్యాపీ బర్త్‌డే సార్, జై తెలంగాణ’ అంటూ పెద్దపెట్టున చేసిన నినాదాలు మిన్నంటాయి.
వందేండ్ల ముందుచూపు.. పుస్తకావిషరణ
ఆర్బీఐ తెలంగాణ ప్రగతి నివేదిక గణాంకాలతో జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘వందేండ్ల ముందుచూపు’ పుస్తకాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఆవిషరించారు. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాన్ని గౌరీశంకర్ కేసీఆర్‌కు అందజేశారు. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దశాబ్ద కాలంపాటు కృషితో అందించిన ప్రగతి పాలనలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులు వేయగలిగారన్న అంశాలను అందులో పొందుపర్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి, తకెళ్లపల్లి, మాజీ మంత్రి మహమూద్ అలీ, రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.