Telangana | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏకంగా 16.42 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద వ్యవసాయ రాష్ర్టాలను వెనక్కి నెట్టి మేటి అనిపించుకున్నది. 2018-19 నుంచి 2023-24 వరకు వ్యవసాయరంగంలో వివిధ రాష్ర్టాలు సాధించిన వృద్ధిరేటుపై నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఆహార పంటల ఉత్పత్తి వృద్ధి రేటు పెరుగుదలలో తెలంగాణతో మరే ఇతర రాష్ట్రం కనీసం పోటీలో కూడా నిలువలేకపోయింది. తెలంగాణ 16.42 శాతం వృద్ధి రేటు సాధిస్తే.. 7.11 శాతం వృద్ధి రేటుతో ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. అంటే తొలిస్థానంలో నిలిచిన తెలంగాణకు, రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్ర మధ్య తేడా 9.31 శాతం ఉన్నది. మిగిలిన రాష్ర్టాల్లో బీహార్ 5.14శాతం, మధ్యప్రదేశ్ 4.35 శాతం, కర్ణాటక 3.18 శాతం, ఉత్తరప్రదేశ్ 1.65 శాతం, పంజాబ్ 0.66 శాతం, హర్యానా 0.34శాతం, పశ్చిబెంగాల్ 0.14శాతం వృద్ధిరేటును నమోదు చేశాయి.
ఆహార పంటల ఉత్పత్తుల వృద్ధిరేటులో తెలంగాణ సాధించిన ఈ ఘనతకు వెయ్యిశాతం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఆయన అమలుచేసిన వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పంట పొలాలకు గోదావరి జలాలను పరుగులు పెట్టించారు మాజీ సీఎం కేసీఆర్. చెరువులన్నీ కాళేశ్వరం జలాలతో నింపడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు ఉబికివచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడా సాగు నీళ్ల కొరత, కరవు అనే మాటే వినిపించలేదు. దీనికితోడు రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయాన్ని కూడా అందించారు. రైతుబీమా పథకం ద్వారా బీమా సదుపాయం, సబ్సిడీలో ట్రాక్టర్లను అందించడం, కళ్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు వంటి చర్యలు వ్యవసాయానికి, రైతుకు దన్నుగా నిలిచాయి. దీంతో రైతులు కూడా నిబ్బరంగా వ్యవసాయం చేసి పసిడి పంటలు పండించారు.
కాళేశ్వరం జలాల రాకతో రాష్ట్రంలో సాగునీటికి కొరత తీరడంతో.. 2018-19 నుంచి పంటల సాగు భారీగా పెరిగింది. 2018-19కి ముందు 1.30 లక్షలకు అటుఇటుగా ఊగిసలాడిన సాగు విస్తీర్ణం ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018-19లో 1.34 కోట్ల ఎకరాల నుంచి 2022-23 నాటికి 2.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి అనుగుణంగా పంటల ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఒక దశలో పంజాబ్ రాష్ర్టాన్ని తలదన్నేలా 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదగడం గమనార్హం.