హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర ఫలాలు చివరి గడప వరకు చేరే విధంగా కృషి జరగాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. పరాయి పాలన నుంచి దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులతో భరతమాత స్వయంపాలన దిశగా అడుగులేసి.. నేటికి 79 ఏండ్లు గడిచాయని గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగనిరతితో ఎందరో అమరవీరులు, దేశభక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని కొనియాడారు.
నిరాయుధ, శాంతియుత, అహింసా పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపించిన దేశ స్వాతంత్య్ర పోరాట కార్యాచరణ స్ఫూర్తి.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇమిడి ఉన్నదని వివరించారు. జాతి ఆత్మగౌరవం కోసం, స్వయంపాలన కోసం చేసిన త్యాగాలు.. స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం కావడం బాధాకరమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. పదేండ్ల అనతికాలంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉన్నదని తెలిపారు. అమరుల త్యాగాలను గౌరవించి, స్వాతంత్య్ర ఫలాలు చివరి గడపకు చేరి, దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన నాడే దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మరింత ఇనుమడింపచేస్తాయని స్పష్టంచేశారు.