హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): క్రీస్తు పుట్టినరోజును పురసరించుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఏ నేరమూ చేయని తనను శిలువకు ఎక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించాలని ప్రభువును వేడుకున్న మహాత్యాగశీలి, అహింసావాది యేసు క్రీస్తు అని కేసీఆర్ కొనియాడారు. పాపులను సైతం క్షమించే ఓర్పు, సహనం, దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతిమార్గమని తెలిపారు. విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒకరికీ యేసు బోధనలు అనుసరణీయమని, ద్వేషంతో నిండిపోతూ రోజురోజుకూ స్వార్థపూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గంగా-జమున సంస్కృతి పరిఢవిల్లేలా, మత సామరస్యం వెళ్లివిరిసేలా సర్వమత హితాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించి చూపిందని వివరించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలుచేశామని పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో వైభవోపేతంగా నిర్వహించిందని గుర్తుచేశారు.