KCR | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతీరోజూ పార్టీ కార్యకర్తలను కలుస్తారని తెలిపారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పథకాలను రద్దు చేసినంత మాత్రాన, పేర్లు మార్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పాలన కాదనలేనిదని అన్నారు. కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తుందని, కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రద్దు.. వాయిదాలు అన్నట్టుగా సాగుతున్నదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి, రౌడీషీట్లు ఓపెన్‌చేసి భయభ్రాంతులకు గురిచేస్తే గులాబీ సైన్యం బెదరదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలమంతా బస్సు కట్టుకొని వాలిపోతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆగడాలపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు, నాయకులను పార్టీ కంటికిరెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశామే కానీ రాజీ పడలేదని అన్నారు. కేసులు, జైళ్లు తమకు కొత్తకాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఏడాది తిరగకముందే ప్రజలనుంచి తిరుగుబాటు వస్తుందని తెలిసిపోతున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై, పాలనపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, పార్టీలో అక్కడక్కడా జరిగిన చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఓడిపోయామని పేర్కొన్నారు. అన్నిస్థాయిల పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, వచ్చిన సూచనలకు అనుగుణంగా త్వరలో పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వ్యవహరించి ప్రజల పక్షాన నిలబడుతామని తెలిపారు. పెద్దపల్లితోపాటు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందేందుకు సమష్ఠి కృషి, సమన్వయంతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులెవరూ అధైర్య పడొద్దని, త్వరలో మంచిరోజులు వస్తాయని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందని చెప్పారు. సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, బోడ జనార్దన్, ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్సహా జిల్లా పరిషత్తు చైర్మన్లు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
అధైర్యపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రె డ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే పార్లమెంటరీ వ్యవస్థలో ఓడిపోని రాజకీయ పారీ ్టలేదని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పార్టీని అంతగా పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. జరిగిన నష్టానికి కారణాలు విశ్లేషిస్తూనే భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడంలో స్థితప్రజ్ఞత చూపాల్సిన అవసరం ఉన్నదని, పార్టీ శ్రేణులు అందుకు అనుగుణంగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీది చారిత్రకపాత్ర అని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబులాంటి బలమైన నాయకులను కేసీఆర్ ఎదుర్కొని తెలంగాణ వాదాన్ని ద్విగిణీకృతం చేశారని వివరించారు. తెలంగాణ వస్తదో? రాదో? అనే సంశయంతో పార్టీలో చేరేందుకే ముందుకురాని వాతావరణం ఆనాడు ఉండేదని, అలాంటిది కేసీఆర్ దార్శనికత, వ్యూహ చతురత, సుదీర్ఘపోరాటం ఫలితంగా రాష్ర్టాన్ని సాధించి, సాధించిన తెలంగాణను దేశానికే మార్గదర్శనం చేశామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకపోవచ్చుకానీ తెలంగాణ ప్రజల టార్చ్‌బేరర్‌గా కొనసాగుతుందని తెలిపారు.