Niranjan Reddy | పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 శాతం పనులను పూర్తిచేస్తే నీళ్లను వాడుకోవచ్చని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. రూ.32 వేల కోట్ల పనులు బీఆర్ఎస్ పూర్తి చేసిందని తెలిపారు. రూ.27 వేల కోట్ల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణ నీటి లభ్యత గురించి తెలియజేశారని అన్నారు. ముందే అప్రమత్తమైతే తెలంగాణ నీటి వాటాను కోల్పోయేది కాదని అభిప్రాయపడ్డారు.
పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరీ మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్ పంప్‌హౌజ్, రిజర్వాయర్, వట్టెం పంప్‌హౌజ్, కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జూరాలకు సరాసరి 25 రోజులు వరద వస్తుందని అన్నారు. జూరాల ప్రాజెక్టు కడితే తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. 3 లక్షల పైచిలుకు జనం ముంపునకు గురవుతారని పేర్కొన్నారు. ఇంత చేసినా జూరాల వద్ద నీళ్లుండవని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి అన్ని రిజర్వాయర్లను నింపితే 68 టీఎంసీల నీళ్లు వస్తాయని తెలిపారు. అవసరమైతే మళ్లీ నీళ్లను నింపుకోవచ్చని అన్నారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ నీళ్లను వాడుకుంటే ఇబ్బందని జూరాల ప్రాజెక్టు తీసుకొచ్చారని మండిపడ్డారు.
జూరాల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు 40 ఏళ్ల నుంచి ప్రజలకు చూపిస్తున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే అని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏం కోల్పోయామో అర్థమైతే ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. చరిత్రలో కాంగ్రెస్‌కు స్థానమే ఉండదని.. ఎప్పటికైనా చరిత్రలో నిలిచేది కేసీఆరే అని స్పష్టం చేశారు. దొంగ మాటలు, మోసాలతో ప్రజలను ముంచాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవో 24ను ఒకసారి చదువుకోవాలని సూచించారు. ఏపీ ట్రాప్‌లో కాంగ్రెస్ నేతలు పడిపోవద్దన్నారు.